
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దు
● నకిలీ మద్యంపై చర్యలు తీసుకోండి
● సీపీఎం జిల్లా నేతల డిమాండ్
అమలాపురం టౌన్: కల్తీ, నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతుందని సీపీఎం జిల్లా శాఖ దుయ్యబట్టింది. నకిలీ మద్యం మాఫియాపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మద్యం నాణ్యతను పర్యవేక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆందోళన వ్యక్తం చేసింది. అమలాపురంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు తదితరులు సోమవారం సమావేశమై నకిలీ మద్యం అదుపు వైఫల్యంపై చర్చించారు. ఈ కల్తీ మద్యం రాకెట్ వెనుక రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు ఉండడంతో వారు ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతోనే ఈ మాఫియా నడిపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మద్యం ద్వారా వచ్చే ఆదాయంపైనే ప్రత్యేక దృష్టి పెట్టిందే తప్ప, దానివల్ల వచ్చే దుష్పరిణామాలు, దెబ్బతింటున్న ప్రజారోగ్యాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జిల్లాలోని అల్లవరం మండలం కొమరిగిరపట్నంలో ఇటీవల కాలంలో నకిలీ మద్యం యూనిట్ వెలుగు చూసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బయట పడడం చూస్తుంటే మొత్తం రాష్ట్రం కల్తీ మద్యమయ్యే పరిస్థితులు అనివార్యమవుతున్నాయని వారు ఆరోపించారు.
నకిలీ లేబుళ్లు, రసాయనాలు, రంగులతో కల్తీ మద్యం మాఫియా చెలరేగిపోతోందని విమర్శించారు. మద్యం తాగి ఎవరైనా అనారోగ్యం పాలైతే ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. నకిలీ మద్యంపై తక్షణ చర్యలు తీసుకోకపోతే సీపీఎం జిల్లా శాఖ ప్రత్యేక ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు.
జిల్లా సీపీఎం నాయకులు జి.దుర్గాప్రసాద్, బలరామ్, టి.నాగవరలక్ష్మి, కె.కృష్ణవేణి, పీతల రామచంద్రరావు, తాడి రామ్మూర్తి, సఖిలే సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.