
గురువు మార్గదర్శకత్వం అవసరం
సహస్రావధాని గరికపాటి
రాయవరం: సన్మార్గం వైపు అడుగులు వేసేందుకు ప్రతి ఒక్కరికీ గురు మార్గదర్శకత్వం అవసరమని, అప్పుడే దైవానుగ్రహానికి దగ్గరవుతామని సాగరఘోష కవి, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ఉద్బోధించారు. మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆధ్మాత్మిక ప్రసంగం చేస్తూ తల్లి, తండ్రి, గురువు తర్వాతే దైవం అన్నారు. తల్లిదండ్రులను, గురువును ఆరాధించడం భగవంతుడిని ప్రార్థించడం కంటే గొప్పదన్నారు. ఐశ్వర్యం, భోగభాగ్యాలు అశాశ్వతమని, గురువు చూపిన మార్గంలో పయనిస్తే దైవానుగ్రహానికి దగ్గరవుతారన్నారు. విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) చూపిన దారిలో భక్తులు నడవాలన్నారు. మరో సాహితీవేత్త మహామహాపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ అమ్మతత్వాన్ని వివరించారు.
పీఠంలో ఆర్‌డీవోల పూజలు
కొత్తపేట, రామచంద్రపురం ఆర్‌డీవోలు శ్రీకర్, అఖిల దంపతులు మంగళవారం విజయదుర్గా పీఠాన్ని సందర్శించారు. అనంతరం పీఠంలో విజయదుర్గా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పీఠాధిపతి గాడ్ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో పీఠాన్ని సందర్శించినట్లు తెలిపారు. విజయదుర్గా అమ్మవారి ఆశ్శీస్సులు అందరిపై ఉండాలని, అందరికీ మంచి జరగాలని అమ్మవారిని కోరుకున్నట్టు వారు తెలిపారు.