
కొబ్బరి మరింత ప్రియం
– వెయ్యికాయల ధర రూ.26 వేలు
సాక్షి, అమలాపురం: కొబ్బరి కాయ ధర మరింత పెరిగింది. దసరా ఎగుమతులు జోరుగా సాగుతుండడంతో కాయకు అంచనాలకు మించి ధర వస్తోంది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో శుక్రవారం సాయంత్రం వెయ్యికాయల ధర రూ.25 వేల నుంచి రూ.26 వేల వరకు పలికింది. గోదావరి లంక గ్రామాల కాయను రూ.27 వేలు చేసి కొంటున్నారని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. కొబ్బరికాయకు గత నెల రోజులుగా రికార్డు స్థాయిలో ధర పెరుగుతున్న విషయం తెలిసిందే. తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటోంది. కాయకు రూ.20 ధర రావడమే రైతులు ఊహించలేదు. అటువంటిది ఇప్పుడు ఈ ధర చూసి రైతులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. దసరా, తరువాత దీపావళి, ఆపై కార్తిక మాసం కావడంతో ధర అనూహ్యంగా పెరిగింది. మహారాష్ట్ర నుంచి డిమాండ్ లేకపోవడంతో ధర ఈస్థాయిలో ఉంది, లేకుంటే రూ.28 వరకు వచ్చేదిని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి రోజుకు 60 లారీలకు పైగా కొబ్బరికాయ గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌కు అధికంగా ఎగుమతి అవుతోంది.
సమన్వయంతో
దసరా ఉత్సవాలు
జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్
అమలాపురం రూరల్: అమలాపురం పట్టణంలో దసరా ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలోనూ, సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఉత్సవ కమిటీలకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా, డివిజన్‌స్థాయి పోలీసు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, దేవదాయశాఖ అధికారులు ఉత్సవ కమిటీ పెద్దలతో సమీక్షించారు. ప్రాచీన కళల్లో ఒకటైన తాలింఖానాను ఏటా స్థానికంగా నిర్వహిస్తూ వీరత్వానికి, ఐకమత్యానికి క్రమశిక్షణకు సూచికగా నిలుస్తున్నాయన్నారు. ఈ ఉత్సవాలకు ముందస్తు ఏర్పాటు చర్యలపై ఈ నెల 26న సమావేశం నిర్వ హిస్తామన్నారు. అధికారులు, కమిటీ పెద్దల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ఎస్పీ బి.కృష్ణారావు మాట్లాడుతూ ఏడు వీధుల ప్రదర్శనల వివాద రహితంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కె.మాధవి ఆర్డీవోలు పి.శ్రీకర్, డి.అఖిల దేవదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ సత్యనారాయణ జిల్లా స్థాయి అధికారులు, డీఎస్పీలు పాల్గొన్నారు.
కెరీర్ కౌన్సెలింగ్ యాప్ రూపొందించండి
పదో తరగతి విద్యార్థులకు కెరీర్ కౌన్సెలింగ్ ఇవ్వడం వల్ల జీవిత పథాన్ని ప్రభావితం చేస్తాయని అందువల్ల పాఠశాలల గోడలపై కెరీర్ గైడెన్స్ ట్రీ ప్రదర్శన, కరపత్రాలు, సామాజిక మాధ్యమ యాప్‌ను రూపొందిస్తున్నట్టు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం మామిడికుదురు జెడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థి ప్రతాపనేని నవీన్, హెచ్‌ఎం చిరంజీవితో సమావేశం నిర్వహించి కెరీర్ కౌన్సెలింగ్ ట్రీ కరపత్రం ప్రచురణ కెరీర్ గైడు, స్టూడెంట్ యాక్టివిటీ, కెరీర్ కౌన్సెలింగ్ గైడెన్స్ యాప్ రూప కల్పనపై సమీక్షించారు. డిసెంబరు నాటికి వివిధ ప్రచార అంశాలపై కసరత్తు పూర్తి చేసి జనవరి నుంచి కెరీర్ కౌన్సెలింగ్‌ను అమలులోకి తీసుకురావాలన్నారు. ఇంటర్ తరువాత ఏ వైపు వెళ్లాలనే విషయమై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.