భావోద్వేగాల బంధానికి బైబై! | - | Sakshi
Sakshi News home page

భావోద్వేగాల బంధానికి బైబై!

Sep 6 2025 5:35 AM | Updated on Sep 6 2025 5:35 AM

భావోద

భావోద్వేగాల బంధానికి బైబై!

15 పైసల పోస్టు కార్డు.. ఇన్‌లాండ్‌ కవర్‌.. కవరింగ్‌ లెటర్‌.. రిజిస్టర్డ్‌ పోస్టు.. టెలిగ్రాం.. ఇలా ఎన్నో సేవలు సుదీర్ఘ కాలం అందించిన తపాలా శాఖ కొన్ని బంధాలను వదిలించుకుంటోంది. కారణం.. కాలంతో పరుగులు తీయాలనుకోవడమే. సాంకేతికత రాకెట్‌ వేగంతో సాగుతుంటే కనీసం బుల్లెట్‌ ట్రైన్‌లా అయినా ముందుకు సాగకపోతే తన ఉనికికే ప్రమాదమని గ్రహించింది ఆ శాఖ. ఎస్సెమ్మెస్‌ మొదలైన దగ్గర నుంచి ఊపందుకున్న సాంకేతికత నేడు చాలా వేగంగా విస్తరించి అతి తక్కువ వ్యవధిలో పెద్ద పెద్ద ఫైళ్లను సైతం ఈ మెయిల్‌ రూపంలో చేరవేస్తోంది. ఇవన్నీ చూస్తున్న నాటి తరం కొంత నిట్టూర్పు విడుస్తున్నారు. రోజుల తరబడి నిరీక్షణ అనంతరం తాము అందుకున్న ఉత్తరాలు, రిజిస్టర్డ్‌ పోస్టులను గుర్తు చేసుకుని ఇక ఆ సేవలు కనుమరుగు కానున్నాయని తెలియడంతో కాస్త మనస్తాపానికి గురవుతున్నారు.

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థను అందిపుచ్చుకుంటూ ఈ సేవల విస్తరణ కోసం సరి కొత్త ప్రయోగాలు చేస్తున్న పోస్టల్‌శాఖ పాత సేవలను మాత్రం ఒక్కొక్కటిగా రద్దుచేస్తూ వస్తోంది. ఇప్పటికే పలు సేవలు రద్దు కాగా, సెప్టెంబర్‌ 1 నుంచి రిజిస్టర్‌ పోస్టుసేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మరో వైపు లెటర్‌ రెడ్‌ (పోస్టల్‌) బాక్స్‌ను కూడా ఎత్తివేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ప్రధానంగా పోస్టల్‌ శాఖ నూతన ఒరవడితో ఈ–సేవల విస్తరణపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. మొబైల్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ సేవలు లేని రోజుల్లో సమాచార వ్యవస్థకు ఉన్న ఏకై క దిక్కు తపాలానే. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు మరింత సులువైన సేవలందించేందుకు సాంకేతికతకు పోస్టల్‌ డిపార్టుమెంట్‌ అప్‌గ్రేడ్‌ అవుతోంది.

రిజిస్టర్డ్‌ పోస్టుకు మంగళం

పోస్టల్‌శాఖ రిజిస్టర్‌ పోస్టు సేవలకు మంగళం పాడింది. తాజాగా బ్రిటీషు కాలం నుంచి వస్తున్న రిజిస్టర్డ్‌ పోస్ట్‌ సేవలు సెప్టెంబర్‌ 1 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పోస్టు మాస్టర్లకు ఇప్పటికే శాఖాపరమైన నోటీసులు జారీచేసింది. ఒకప్పుడు బంధుమిత్రులకు కబురు పంపాలన్నా ముఖ్యమైన పత్రాలు చేరవేయలన్నా పోస్టుకార్డు లేదా రిజిస్టర్డ్‌ పోస్టు మాత్రమే అందుబాటులో ఉండేది.

సుమారు 171 ఏళ్లుగా..

పోస్టల్‌ వ్యవస్థ ప్రజల జీవితంలో విడదీయరాని భాగమైంది. కాలంతో పాటు మారిన పోస్టల్‌ శాఖ ఇప్పుడు మరింత ఆధునిక సేవలతో మందుకు వస్తోంది. 1854లో అప్పటి బ్రిటిష్‌ అధికారి లార్డ్‌ డల్హౌసీ ప్రవేశపెట్టిన ఇండియా పోస్ట్‌ ఆఫీస్‌ చట్టంతో సేవలు ప్రారంభమయ్యాయి. అంతకు ముందుగా 1766లో వారెన్‌ హేస్టింగ్స్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో కంపెనీ మెయిల్‌ మొదలైంది. దాదాపు 171 ఏళ్లుగా ముఖ్యమైన పత్రాలను, వస్తువులను సురక్షితంగా, నమ్మకంగా పంపించడానికి రిజిస్టర్డ్‌ పోస్ట్‌ ప్రధాన మార్గంగా నిలిచింది. లీగల్‌ నోటీసులు, అపాయింట్‌మెంట్‌ లెటర్లు, బ్యాంకింగ్‌ సంబంధిత పత్రాలు వంటి వాటిని పంపడానికి ఎంతగానో ఉపయోగపడింది. పంపిన వస్తువు అవతలి వారికి చేరినట్లు రసీదు (డెలివరీ ప్రూఫ్‌) పొందడం ఒక ప్రత్యేకత, చట్ట పరంగా సైతం ఎంతో విలువైనది.

స్పీడ్‌ పోస్టులో విలీనం

రిజిస్టర్డ్‌ పోస్టు సేవను పూర్తిగా స్పీడ్‌ పోస్టు సేవలో విలీనం చేస్తున్నట్లు తపాలా శాఖ ప్రకటించింది. ఆ శాఖ తమ సేవలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా దేశీయ పోస్టల్‌ సేవల క్రమబద్దీకరణ, పనితీరు మెరుగుపరచడం, ట్రాకింగ్‌ వ్యవస్థను బలోపేతం చేయడం తదితర ప్రక్రియలో భాగంగానే స్పీడ్‌పోస్టులో రిజిస్టర్డ్‌ పోస్టు విలీనం చేస్తున్నట్లు వెల్లడించింది. స్పీడ్‌ పోస్టు అంటే వేగవంతమైన డెలివరీ. ఇప్పుడు రిజిస్టర్డ్‌ పోస్టు సేవలు స్పీడ్‌పోస్టులో కలపడంతో డెలివరీలు మరింత వేగవంతంగా గమ్యాన్ని చేరనున్నాయి. స్పీడ్‌ పోస్టు ద్వారా పార్శిల్‌ ఎక్కడి వరకు చేరిందో ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకే సేవ ఉండటం వల్ల పోస్టల్‌ శాఖ పని మరింత సులభమవుతుందని అధికారులు చెప్తున్నారు.

తగ్గిన ఆదరణ.. పెరిగిన సాంకేతికత..

వాస్తవంగా రిజిస్టర్డ్‌ పోస్ట్‌ వాడకం గణనీయంగా తగ్గింది. వాట్సాప్‌, జీ మెయిల్‌ వంటి డిజిటల్‌ మాధ్యమాల రాకతో సమాచార మార్పిడి చాలా వేగవంతమైంది. ప్రభుత్వ కార్యాలయాలు సైతం ఇప్పుడు డిజిటల్‌ మార్గంలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహిస్తున్నాయి. ఐదేళ్ల క్రితం సాగిన రిజిస్టర్డ్‌ పోస్ట్‌ బుకింగ్‌లను పరిశీలిస్తే 25 శాతం పడిపోయాయి. స్పీడ్‌ పోస్టు, ఇతర కొరియర్ల సేవలు అందుబాటులోకి రావడంతో రిజిస్టర్డ్‌ పోస్టు డిమాండ్‌ అంతకంతకూ తగ్గుతూ వచ్చింది. అయితే తాజాగా స్పీడ్‌ పోస్టుతో చార్జీల మోత తప్పని పరిస్థితి కనిపిస్తోంది. రిజిస్టర్డ్‌ పోస్ట్‌ కనీస చార్జి రూ.26 నుంచి రూ.30 వరకు ఉంటుంది. స్పీడ్‌ పోస్ట్‌ కనీస చార్జి రూ.41 ఇది రిజిస్టర్డ్‌ పోస్ట్‌తో పోలిస్తే 20 నుంచి 25 శాతం ఎక్కువ. ఇక చార్జీల భారం మొయకతప్పదు.

రెడ్‌ పోస్టు బాక్స్‌ ఎత్తివేత ఊహగానమే..

రిజిస్టర్డ్‌ పోస్ట్‌ సేవల రద్దు నేపథ్యంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన రెడ్‌పోస్టు ఎత్తివేత ప్రచారం జోరుగా సాగుతోంది. సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. దీంతో పోస్టల్‌ శాఖ అభిమానులు ఒకింత కలవరానికి గురవుతున్నారు. దశాబ్దాలుగా నిస్వార్థంగా.. నిశ్శబ్దంగా.. నిశ్చలంగా.. విశ్వసనీయంగా సేవలు అందించిన భావోద్వేగాల నేస్తం ఇక కనిపించిందన్న బాధ వారిలో వ్యక్తమవుతోంది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, అది ఒక ఊహాగానమేనని పోస్టల్‌ వర్గాలు అంటున్నాయి. పోస్టల్‌ శాఖ ద్వారా ఎరుపు పోస్ట్‌బాక్సును ఎత్తివేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఏదీ లేదని స్పష్టం చేస్తున్నారు.

ఆదేశాలు లేవు..

పోస్టుబాక్స్లు ఉండవని సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారం కేవలం ఉహాగానమే. ఇప్పటి వరకు పోస్టుబాక్స్లు తొలగింపునకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు రాలేదు. కేవలం రిజిస్టర్‌ పోస్టు మాత్రమే నిలిపివేశారు.

– దాసరి నాగేశ్వరరెడ్డి,

పోస్టల్‌ సూపరిండెంట్‌, కాకినాడ

తపాలా సేవలపై అయోమయం

ఇప్పటికే రిజిస్టర్డ్‌ పోస్ట్‌ సేవల నిలిపివేత

తాజాగా లెటర్‌ రెడ్‌ బాక్స్‌

ఎత్తివేత ప్రచారం

అదేమీ లేదంటున్న ఆ శాఖ అధికారులు

ఈ–సేవ విస్తరణలో

పోస్టల్‌ శాఖ నిమగ్నం

భావోద్వేగాల బంధానికి బైబై!1
1/1

భావోద్వేగాల బంధానికి బైబై!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement