
ఉపాధ్యాయులు మార్గ నిర్దేశకులు
● కలెక్టర్ మహేష్ కుమార్
● జిల్లాలో 64 మందికి
ఉత్తమ పురస్కారాల ప్రదానం
అమలాపురం రూరల్: ఉపాధ్యాయులు జీవిత మార్గదర్శకులు, సమాజ నిర్మాణ శిల్పులని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయిలో ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువులు జీవిత మార్గదర్శకులు, సమాజ నిర్మాణ శిల్పులని పేర్కొన్నారు. తల్లి, తండ్రి, గురువు నిత్యం పూజ్యనీయులన్నారు. గురి, లక్ష్యం, దిశ, మార్గం చూపే వారే గురువు అని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. విశిష్ట సేవలతో విద్యారంగాన్ని అలంకరించిన దిగ్గజ ఉపాధ్యాయులకు ఘన సన్మానం చేయడం అభినందనీయమన్నారు. 64 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మాన పత్రాలతో సత్కరించారు. డీఆర్‌ఓ కొత్త మాధవి మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిని పవిత్రమైనదిగా భావించి విద్యాబోధన చేసేవారన్నారు. అందుకే ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించడం విశేషమన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి మాట్లాడుతూ భారతదేశ మొట్ట మొదటి ఉప రాష్ట్రపతి, రెండో రాష్ట్రపతిగా పని చేసిన సర్వేపల్లి గొప్ప తత్వవేత్తగా భారతీయ తాత్విక చింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశపెట్టారన్నారు. డీఈవో షేక్ సలీం బాషా మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దు కుంటుందన్నారు. మాజీ రాష్ట్రపతి సర్వే పల్లి రాధాకృష్ణ సమాజానికి, విద్యార్థులకు మార్గదర్శి ఉపాధ్యాయుడన్నారని పేర్కొన్నారు. తన జ్ఞానాన్ని విద్యార్థులకు పంచుతూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాడని, విలువలు, దేశభక్తిని నేర్పుతాడని ఆదర్శంగా జీవిస్తాడన్నారు. అందుకే గురువు స్థానం వెలకట్టలేనిదన్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్న ట్టు విద్యార్థులు ఎంత ఎత్తుకు ఎదిగినా ఉపాధ్యాయుల వద్ద ఓనమాలు నేర్చుకున్న వారేనని అందుకే వారికి సముచిత గౌరవం దక్కు తుందన్నారు. ఏపీసీ జి.మమ్మి మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని, అజ్ఞానాన్ని పారదోలి జ్ఞాన మా ర్గంలో నడిపించడం గురువుకే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పందిరి శ్రీహరిరామ్ గోపాల్, డీసీసీబీ సభ్యులు బి.హనుమంతరావు, డీఎస్‌ఓ జీవీఎస్ సుబ్రహ్మణ్యం సీఎంఓ సుబ్రహ్మణ్యం, ఏఎంవో రాంబాబు, ఉప విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.