
ఇలా తగ్గి.. అంతలోనే అంతై ముంపు..
● 20 రోజులుగా వరద పరిస్థితి ఇదీ..
● అవస్థలు పడుతున్న లంక వాసులు
ఐ.పోలవరం: గోదావరి వరద లంకవాసులతో దోబూచులాడుతోంది. గత నెల ఆగస్టు 15 నుంచి శుక్రవారం వరకు అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల పరిధిలోని లంక గ్రామాల వాసులు, ఏటిగట్టును ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో నివాసిస్తున్న వారిని ఇక్కట్ల పాలు చేస్తోంది. సుమారు 20 రోజులుగా గోదావరి వరద ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని 10 గ్రామాలపై ప్రత్యక్షంగాను, పరోక్షంగా ప్రభావం చూపుతోంది.
గోదావరికి ఈ ఏడాది జూలై 26వ తేదీన స్వల్పంగా వరద వచ్చింది. తరువాత ఆగస్టు 15వ తేదీన మరోసారి వరద రాగా అది తగ్గే సరికి ఆగస్టు 22వ తేదీ నుంచి మరోసారి వరద వచ్చింది. నాటి నుంచి శుక్రవారం వరకు వరద తగ్గుతూ.. పెరుగుతూ.. తగ్గుతూ లంక వాసులు, ఏటిగట్టును ఆనుకుని ఉన్న సామాన్యులతో దోబూచులాడుతూనే ఉంది. దీని వల్ల వైనతేయ, గౌతమీ, వృద్ధ గౌతమీ నదీపాయలను ఆనుకుని ఉన్న లంక గ్రామాలు, ఏటిగట్టును ఆనుకుని ఉన్న గ్రామాలు పలు సందర్భాలలో ముంపుబారిన పడుతున్నాయి. ఇళ్లు వరద ముంపులో చిక్కుకున్నాయి. రోడ్లు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి. ఇళ్లు, తోటల్లో వరద నీరు చేరింది.
గోదావరి వరద ఎగువన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శుక్రవారం ఉదయం నుంచి తగ్గుముఖం పడుతోంది. కానీ దిగువన ఉన్న ముమ్మిడివరం మండల పరిధిలోని గురజాపులంక, లంక ఆఫ్ ఠాన్నేల్లంక, ఐ.పోలవరం మండల పరిధిలో మురమళ్ల, కేశనకుర్రు పంచాయతీ శివారు పల్లిగూడెం, కాట్రేనికోన మండలం పల్లంకుర్రు రేవు, బలుసుతిప్ప, అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెం వాసులు వరద ప్రభావాన్ని నేరుగా చూశారు. వరదల వల్ల స్థానిక రైతులు విలువైన కూరగాయ పంటలను కోల్పోయారు. అరటి, బొప్పాయి, కంద, వంగ, బీర, బెండ, టమాటాతో పాటు పందిరి కూరగాయలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. అలాగే మత్స్యకారులకు గడిచిన 20 రోజులుగా మత్స్య సంపద లభ్యం కాకపోవడం వల్ల జీవనోపాధికి గండి పడి పస్తులుంటున్నారు. ఇప్పటికీ వరద పూర్తిస్థాయిలో తగ్గకపోవడంతో వారు కష్టాలు వీడలేదు.

ఇలా తగ్గి.. అంతలోనే అంతై ముంపు..