
ముద్రగడ క్షేమంగానే ఉన్నారు
ముద్రగడ పెద్ద కుమారుడు వీర్రాఘవరావు
కిర్లంపూడి: మాజీ మంత్రి, రాష్ట్ర వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యులు ముద్రగడ పద్మనాభం క్షేమంగా ఉన్నారని ఆయన పెద్ద కుమారుడు వీర్రాఘవరావు (బాలు)తెలిపారు. ముద్రగడ ఇటీవల అస్వస్థతకు గురికాగా హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించిన విషయం విదితమే. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యానికేమి ఢోకా లేదని, ఆయన క్షేమంగా ఉన్నారని ఆయన పెద్ద కుమారుడు వీర్రాఘవరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో ఉండడంతో తన తండ్రి వద్దకు ఎవరినీ అనుమతించడం లేదన్నారు. ప్రజల ఆశీస్సులతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని దయచేసి ఎవరూ ఆసుపత్రికి వెళ్లొద్దని వీర్రాఘవరావు కోరారు.
విద్యతోపాటు క్రీడలూ అవసరమే
రాజానగరం: విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, వాటికి కూడా తగిన సమయాన్ని కేటాయించి, క్రీడలలోనూ మంచి ప్రతిభను చాటాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి. చంద్రశేఖర్ అన్నారు. స్థానిక జీఎస్‌ఎల్ వైద్య కళాశాల క్రీడా మైదానంలో యూనివర్సిటీ స్థాయిలో మూడు రోజులపాటు జరిగే 25 వ వుమెన్ స్పోర్ట్సు మీట్‌ని మంగళవారం గాలిలోకి బెలూన్స్‌ని వదిలి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. 24 మెడికల్ అండ్ డెంటల్ కళాశాలల నుంచి 567 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నారని యూనివర్సిటీ స్పోర్ట్సు క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఈ. త్రిమూర్తి తెలిపారు. వాలీబాల్, త్రోబాల్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్, చెస్ వంటి ఆటలలో ఈ పోటీలు జరుగుతున్నాయని జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజ్ పీడీ శ్రీనివాసరావు చెప్పారు. జీఎస్‌ఎల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్‌ఎస్ మిశ్రా, సూపరింటెండెంట్ డాక్టర్ టీవీఎస్‌పీ మూర్తి పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి
సీతానగరం: మండలంలోని బొబ్బిల్లంకకు చెందిన పోలిన వెంకట్రావు (70) రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకట్రావు అనారో గ్యం బారిన పడ్డారు. ఆ బాధ తట్టుకోలేక సోమ వారం రాత్రి 9 గంటలకు ఇంటి వద్ద పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యు లు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకట్రావు మంగళవారం ఉదయం 9 గంటలకు మరణించారు. ఆసుపత్రి సమాచారం, మృతుని కుమారుడు పోలిన వీరవెంకట సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు

ముద్రగడ క్షేమంగానే ఉన్నారు