
కాలుష్య కారక పరిశ్రమలను రద్దు చేయాలి
అరుణోదయ విమలక్క డిమాండ్
పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తీర ప్రాంత మత్స్యకారులను రోడ్డున పడేసే కాలుష్య కారక పరిశ్రమలు నిలిపివేయాలని అరు ణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉభయ రాష్ట్రాల చైర్‌పర్సన్ విమలక్క విజ్ఞప్తి చేశారు. అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఏఐఎఫ్‌టీయూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏఐఎఫ్టీయూ 34వ వార్షికోత్సవం సందర్భంగా మహాసభ మంగళవారం స్థానిక సూర్యరాయ గ్రంథాలయం ప్రాంగణంలో నిర్వహించారు. తొలుత ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సభాస్థలి వరకు కార్మికులు ఎరజ్రెండాల చేతబట్టి ప్రదర్శన నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి విమలక్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఐఎఫ్టీయూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచే అంజిబాబు అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆమె ప్రసంగించారు. తీర ప్రాంతంలో పలు విషతుల్యమైన పరిశ్రమల వలన వాతావరణ సమతుల్యం దెబ్బతింటోందన్నారు. దీనివల్ల తీర ప్రాంతంలో హేచరీస్ కనుమరుగైపోతాయని, అనేకమంది ఉపాధి దెబ్బతింటుందన్నారు. ప్రధాన వక్త ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికలలో హామీ ఇచ్చి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజలను నయవంచన చేస్తోందని విమర్శించారు.
అదానీకి లబ్ధి చేకూర్చడం కోసం స్మార్ట్ మీటర్లను బలవంతంగా అమరుస్తున్నారని విమర్శించారు. ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కరీం బాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ కరోనా కాలంలో 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా కుదిస్తూ చట్టం చేసిందని, దాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఏఐఎఫ్టీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గొల్ల అంజయ్య, ఏపీ ఆర్‌సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వల్లూరి రాజబాబు, బి రమేష్, ఏపీఆర్సీఎస్ సీనియర్ నాయకులు కొండ దుర్గారావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏపూరి సుధాకర్, తెలంగాణ అధ్యక్షుడు మల్సూర్, ప్రగతిశీల మహిళా సంఘం (సీ్త్ర విముక్తి) కన్వీనర్ డొక్కులూరి సంగీత పాల్గొన్నారు.

కాలుష్య కారక పరిశ్రమలను రద్దు చేయాలి