
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
ఆలమూరు: 216 ఏ జాతీయ రహదారిపై మడికి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ వెంపల చంద్రశేఖర్ (50) మృతి చెందాడు. ఆలమూరు పోలీసుల కథనం ప్రకారం అయినవిల్లి మండలంలోని ముక్కామల సమీపంలోని ఇరుసుమండకు చెందిన చంద్రశేఖర్ తన వ్యాన్‌పై సమీపంలోని కొత్తపేట నుంచి లోడు వేసుకుని రాజమహేంద్రవరం బయలుదేరాడు. రావులపాలెం వచ్చేసరికి ఒక ప్రయాణికుడిని తన వాహనంలో ఎక్కించుకున్నాడు. స్థానిక అంతర్రాష్ట కూరగాయల మార్కెట్ వద్దకు వచ్చేసరికి ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి వ్యాన్ క్యాబిన్‌లో చిక్కుకున్నాడు. దీంతో ఆ ప్రయాణికుడిని బయటకు తీసేందుకు పోలీసు, హైవే సిబ్బంది రెండుగంటల పాటు శ్రమించారు. అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న అతన్ని ఎన్‌హెచ్ అంబులెన్స్‌పై రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై జి.నరేష్ కేసును నమోదు చేయగా రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇరుసుమండలో విషాద ఛాయలు
అంబాజీపేట: చంద్రశేఖర్ మృత్యువాత పడటంతో ఇరుసుమండలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య రామలక్ష్మి, కుమారులు పవన్, చందు ఉన్నారు. అందరితో కలిసి ఉండే చంద్రశేఖర్ ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుని స్వగ్రామం తాడేపల్లిగూ డెం మండలంలోని మిలటరి మాధవరం. అయి తే 30 ఏళ్ల క్రితం వివాహనంతరం ఇరుసుమండ వచ్చి ఇక్కడే ఉంటున్నారని స్థానికులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రాజానగరం: జాతీయ రహదారిపై స్థానిక వైఎస్సార్ జంక్షన్‌లో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగికి చెందిన చవల శ్రీనివాస్ (38) రాగితో తయారు చేసిన ఉంగరాలు, కడియాలను తీర్థాలలోను, గ్రామ గ్రామం తిరుగుతూ అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అవివాహితుడైన అతను తల్లితో కలిసి కొంతమూరులో ఉంటున్నాడు. ఈ క్రమంలో పెద్దాపురంలోని మరిడమ్మ తీర్థంలో రాగి వస్తువులను అమ్ముకునేందుకు తన యాక్టివా స్కూటర్ పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ అతనిని ఢీ కొని, కొద్దిదూరం బైకుతో సహా ఊడ్చుకుంటూ పోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతనిని అదే లారీ డ్రైవర్ అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లాడు. అయితే అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కాగా యాక్టివా స్కూటర్‌పై ప్రయాణిస్తూ తలకు హెల్మెట్ ధరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కొడుకే ఆధారంగా ఉన్న ఆ వృద్ధ తల్లి అనాథగా మిగిలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నారాయణమ్మ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి