
వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం
● చెరువులో దూకిన వారిని కాపాడిన
స్థానికులు
● పురుగులు మందు కూడా తాగినట్టు
పోలీసుల వెల్లడి
● సంతానం పట్టించుకోకపోవడమే
కారణం?
జగ్గంపేట: జీవిత చరమాంకంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవనం సాగించవలిసిన వృద్ధ దంపతులు జీవితంపై విరక్తితో పురుగు మందు తాగి, చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జగ్గంపేట శివారు సీతానగరం గ్రామం వద్ద చోటు చేసుకుంది. అయితే స్థానికులు ఘటన జరిగిన వెంటనే స్పందించి వృద్ధ దంపతులను కాపాడి జగ్గంపేటలోని సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆసుపత్రికి తరలించారు. జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ అందించిన వివరాల ప్రకారం తొండంగి మండలం ఏవీ నగరం గ్రామానికి చెందిన 70 ఏళ్ల సక్కుల సత్యనారాయణ, 65 ఏళ్ల సక్కుల మంగతాయారు దంపతులు. సత్యనారాయణ పెద్దాపురంలో శ్రీ చక్ర హాస్పిటల్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. సంతానం ఈ దంపతుల మంచి చెడ్డలు పట్టించుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెందినట్టు భావిస్తున్నామన్నారు. దీంతో మంగళవారం జగ్గంపేట శివారు సీతానగరం గ్రామం వద్ద చెరువు వద్దకు చేరుకుని పురుగు మందు సేవించి ఆత్మహత్య చేసుకోవడానికి చెరువులో దూకారు. అయితే అక్కడ వున్న స్థానికులు దీన్ని గమనించి వారిని రక్షించి చెరువు గట్టుపై పడుకోబెట్టి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాసరావు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని జగ్గంపేట సీహెచ్‌సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు.