
పాలెం సర్పంచ్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
కడియం: తమకు ప్రభుత్వం కేటాయించిన భూములను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్న మాధవరాయుడుపాలెం సర్పంచ్ అన్నందేవుల చంటిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జేగురుపాడు ఎస్సీ ఫిషర్‌మెన్ సొసైటీ అధ్యక్షుడు సాకా కిరణ్‌కుమార్, మాజీ అధ్యక్షుడు బళ్ల అన్నవరం, మద్దుకూరి సూరిబాబు, మోటిక మునియ్య మంగళవారం కడియం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివరాలను కిరణ్‌కుమార్ విలేకరులకు తెలిపారు. 1977లో జేగురుపాడు గ్రామానికి చెందిన దళితులకు సర్వే నం.10లో 5.58 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. సర్వే నం.84, 86లో సుమారు పది ఎకరాల భూమిని మాధవరాయుడుపాలెం దళితులకు కూడా ఇచ్చిందన్నారు. ఆ భూమిలో దళితులు వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. ఇటీవల పాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి దళితుల భూమిని కబ్జా చేయాలనే ఆలోచనతో తన అనుచరులతో గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. 52 ఏళ్లుగా తమ అధీనంలో ఉన్న భూమిని కబ్జా చేస్తారన్న భయంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ శిలా విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడంతో పాటు, చేపల చెరువును కూడా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. తన రాజకీయ పలుకుబడితో రెవెన్యూ, పోలీసు అధికారులను అడ్డుపెట్టుకుని తాము ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని, దిమ్మెను దౌర్జన్యంగా తొలగించారన్నారు. అందువల్ల చంటిపైనా, అతనికి సహకరించిన వారిపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం ప్రకారం అరెస్టు చేయాలని కోరారు.