
చోరీకి గురైన నగదు, నగలు స్వాధీనం
రౌతులపూడి: మండల కేంద్రమైన రౌతులపూడిలో ఇటీవల పేంటి మరియమ్మ ఇంట్లో చోరీకి గురైన రూ.30 వేల నగదు, 30 గ్రాముల బంగారు నగలను స్వాధీన పరచుకున్నట్లు రౌతులపూడి ఎస్సై జి.వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 12వ తేదీన రౌతులపూడికి చెందిన పేంటి మరియమ్మ ఇంట్లో చోరీ జరిగిందని, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేశామన్నారు. ఈ నేపథ్యంలో రౌతులపూడి శివారు మరిడమ్మతల్లి గుడి వద్ద ఇద్దరు బాలుర నుంచి రూ.30వేలు నగదు, 30గ్రాముల బంగారు నగలను స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు. బాలురను జిల్లా ప్రొహిబిషన్ అధికారి వద్ద హాజరు పరచామన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ డీవీ రమణ, కానిస్టేబుళ్లు బోస్, నూకరాజు, ఉదయ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.