
ఒక్క రోజులోనే హత్య కేసులో నిందితుడి అరెస్ట్
రాజోలు పోలీసులకు ఎస్పీ అభినందనలు
రాజోలు: ప్రియురాలిని హత్య చేసి పరారైన నిందితుడు షేక్ షమ్మాను రాజోలు పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. శుక్రవారం రాజోలు సర్కిల్ కార్యాలయంలో సీఐ టి.వి.నరేష్‌కుమార్, ఎస్సై బి.రాజేష్‌కుమార్‌లు వివరాలు వెల్లడించారు. హత్యకు గురైన పుష్ప తన భర్త నుంచి విడాకులు పొంది నాలుగేళ్ల కుమారుడు, తల్లి గంగతో కలసి బి.సావరం సిద్ధార్థనగర్‌లో ఉంటోంది. ఏడాదిక్రితం నుంచి రాజోలు కోళ్లవారి వీధికి చెందిన షేక్ షమ్మాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారు ఇద్దరూ బి.సావరంలోని పుష్ప ఇంటి వద్ద సహజీవనం సాగిస్తున్నారు. కంప్యూటర్ క్లాస్ పేరుతో పుష్పను షమ్మా అమలాపురం తీసుకుని వెళ్లేవాడు. అర్ధరాత్రి వరకు ఆమెను ఇంటికి తీసుకుని వచ్చేవాడు కాదు. వ్యసనాలకు బానిస అయిన షమ్మా ఆమెను వ్యభిచారం చేసి డబ్బు సంపాదించాలని బలవతం పెట్టేవాడు. ఈ విషయాన్ని ఆమె తల్లి గంగకు, వరసకు అన్న అయిన వినయ్‌కు చెప్పింది. ఈ నెల 16వ తేదీన అమలాపురం నుంచి ఇంటికి అర్ధరాత్రి తీసుకుని రాగా షమ్మాను తల్లి గంగ, అన్న వినయ్ ప్రశ్నించారు. దీంతో అగ్రహించిన షమ్మా కప్‌బోర్డులో ఉన్న చాకుతో వినయ్‌పై దాడికి పాల్పడ్డాడు. అతనికి అడ్డుగా వెళ్లిన పుష్పను చాకుతో గుండెల్లో పొడవగా ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆమెను రక్షించేందుకు అడ్డుగా వెళ్లిన తల్లి గంగ, అన్నయ్య వినయ్‌లకు కత్తి గాయాలు అయ్యాయి. ఎస్పీ కృష్ణారావు, డీఎస్పీ మురళీమోహన్ సూచనల మేరకు నిందితుడిని పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. 24 గంటల్లో నిందితుడిని పట్టుకుని రిమాండ్‌కు పంపిన సీఐ నరేష్‌కుమార్, ఎస్సై రాజేష్‌కుమార్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.