
ఆస్తి కాజేసి.. తండ్రిని గెంటేసి..
● రాజమహేంద్రవరంలో కుమార్తెల నిర్వాకం
● దొంగ దారిలో నాన్న ఇంటి రిజిస్ట్రేషన్
● బ్యాంకు ఖాతాలోని సొమ్ము స్వాహా
● పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసిన వృద్ధుడు
సీటీఆర్‌ఐ: సాధారణంగా తండ్రిపై కుమార్తెలకు ప్రేమ చాలా ఎక్కువ ఉంటుందని చెబుతుంటారు. కొడుకులు చూడకుండా వదిలేసిన చాలామంది తండ్రులు తమ కూతుళ్ల దగ్గర ఆశ్రయం పొందుతున్న సంఘటనలు చాలా చూస్తాం. అయితే రాజమహేంద్రవరంలో ఇద్దరు కుమార్తులు తమ తండ్రినే మోసం చేసి, ఆయన ఇల్లు రాయించుకుని, బ్యాంకు ఖాతా లోని డబ్బులను కూడా కొట్టేశారు. ఆ వృద్ధుడు సోమవారం ఆర్డీవోకు ఫిర్యాదు చే యడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాలు ఇవీ..
సీతంపేటకు చెందిన యోన్నంశెట్టి రాములుకు ప్రస్తుతం 72 ఏళ్లు. ఆయన 40 ఏళ్లగా సీతంపేటలోని సొంతింట్లో నివసిస్తున్నాడు. కాలేజీ అటెండర్‌గా ఉద్యోగం చేసి విశ్రాంతి జీవనం గడుపుతున్నాడు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలిద్దరికీ వివాహాలు చేసి అత్తవారిళ్లకు పంపేశాడు. కుమారుడు ఉద్యోగ రీత్యా చైన్నెలో ఉంటున్నాడు. అయితే 2020లో రాములు భార్య చనిపోవడంతో తండ్రికి తోడుగా ఉండటానికి వచ్చిన కుమార్తెలు ఇక్కడే తిష్ట వేశారు. తమ అన్నయ్యకు తెలియకుండా తండ్రి డబ్బును, ఆస్తిని కాజేశారు. 2023లో ఇంటిని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించున్నారు. అలాగే తండ్రికి తెలియకుండా ఆయన బ్యాంకు ఖాతాలోని రూ.15 లక్షలను తమ ఖాతాలోకి జమ చేసుకున్నారు. విచిత్రమేమిటంటే.. ఆ ఇంటి దస్తావేజులను బ్యాంకులో తాకట్ట్టు పెట్టి గతంలోనే రుణం తీసుకున్నారు. అయినా ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండానే రాజమహేంద్రవరంలో రిజిస్టర్ చేయడం విశేషం. తండ్రి నుంచి ఆస్తి, డబ్బులు తీసుకున్న అనంతరం ఆయనను కొట్టి, నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటకు గెంటేశారు. దీంతో కుమారుడు వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీనిపై 3వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ కేసు నమోదు చేసుకున్నారు. ఇంటి రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరుతూ ఆర్డీవోకు ఫిర్యాదు చేయాలని తెలపగా, సోమవారం పీజీఆర్‌ఎస్‌కు వచ్చారు. వృద్ధాప్యం కారణంగా వినపడకపోవడంతో పాటు నడవలేని పరిస్థితిలో ఉన్న రాములు అవస్థ చూసిన ఏఓ సుజాత.. ఆర్డీవో కార్యాలయం బయటికి వచ్చి వివరాలను అడిగి తెలుసుకున్నారు.