
మధ్యవర్తిత్వంపై అవగాహన ర్యాలీ
అమలాపురం టౌన్: మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమయ్యే కేసులపై కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసులు అవగాహన పెంచుకోవాలని అమలాపురం ఫస్ట్ క్లాస్ అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టు మేజిసే్ట్రట్ ఎస్.శ్రీరేఖ అన్నారు. మిడియేషన్ ఫర్ నేషన్ నినాదంతో సోమవారం అమలాపురం పురవీధుల్లో వన్ కేఎం వాక్ (అవగాహన ర్యాలీ) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక కోర్టుల సముదాయం వద్ద మేజిస్ట్రేట్ శ్రీరేఖ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మధ్యవర్తిత్వ వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం వన్ కేఎం వాక్, మంగళవారం బైక్ ర్యాలీ, బుధవారం సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే వారోత్సవాల తొలి రోజు అమలాపురం రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పి.గోవర్ధన్‌చే పోస్టర్ల ఆవిష్కరణ జరిగిందన్నారు. జిల్లా రవాణాధికారి (ఆర్‌టీవో) దేవిశెట్టి శ్రీనివాసరావు, పట్టణ సీఐ పి.వీరబాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతపల్లి అజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ర్యాలీలో న్యాయవాదులు, పోలీసులు, ప్యానల్ లాయర్లు, లోక్ అదాలత్ మెంబర్లు, పారా లీగల్ వలంటీర్లు, మిరియాం విద్యా సంస్థల విద్యార్థులు, బార్ అసోసియేషన్ కోశాధికారి నందెపు శ్రీవెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.