
ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్
దేవరపల్లి: పొలాల్లోని వ్యవసాయ మోటార్ల వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను దొంగిలిస్తున్న అంతర జిల్లా చోరీ ముఠాను దేవరపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి పలు ట్రాన్స్‌ఫార్మర్లు, 65 రాగి దిమ్మలను, 116.600 కిలోల రాగి తీగతో పాటు రెండు కార్లు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం దేవరపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ ఆ వివరాలు వెల్లడించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరం మండలం రాయకుదురుకు చెందిన కడలి సతీష్, ఏలూరు జిల్లా కృతివెన్ను మండలం లక్ష్మీపురానికి చెందిన వేండ్రపు దుర్గాశ్రీనివాస్, పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలికి చెందిన బళ్లా విజయరత్నం, భీమవరం మండలం దెయ్యాలతిప్పకు చెందిన ఏలూరి పోసయ్య ముఠాగా ఏర్పడి రెండు కార్లు సెల్ప్ డ్రైవింగ్ కోసం అద్దెకు తీసుకున్నారు. వీరి వద్ద ఉన్న రెండు బైక్‌లతో ఉదయం సమయాల్లో రెక్కీ నిర్వహించి, రాత్రి పూట ట్రాన్స్‌ఫార్మర్లను బద్దలు కొట్టి వాటిలోని రాగి తీగను దొంగిలించేవారు. ఇలా తూర్పు, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో 115 ట్రాన్స్‌ఫార్మర్లను చోరీ చేశారు. అందులోని రాగి తీగను భీమవరం మండలం గొల్లవానితిప్పకు చెందిన పావురాయల కోటేశ్వరరావు, దిరుసుమర్రుకు చెందిన సవరపు భీమారావులు కొనుగోలు చేసి తీగను కరిగించి దిమ్మలుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. నిందితులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2023లో 49 ట్రాన్స్‌ఫార్మర్లను దొంగిలించి చేబ్రోలు పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ కాగా, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఇప్పటి వరకూ వివిధ జిల్లాల్లో 115 ట్రాన్స్‌ఫార్మర్లను దొంగిలించగా, 67 కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండడంతో జిల్లా ఎస్పీ, రాజమహేంద్రవరం సీసీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల సహాయంతో ఆ ముఠాను బుధవారం సాయంత్రం దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద దేవరపల్లి ఎస్సై వి.సుబ్రహ్మణ్యం, సిబ్బంది పట్టుకుని అరెస్ట్ చేశారన్నారు. చోరీ సొత్తు విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని చెప్పారు. ఈ ముఠాను పట్టుకోవడానికి సహకరించిన రాజమహేంద్రవరం సీసీఎస్ సిబ్బంది, దేవరపల్లి స్టేషన్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. దేవరపల్లి సీఐ బీఎన్ నాయక్, రాజమహేంద్రవరం సీసీఎస్ సీఐ శ్రీధర్, బాలశౌరీ తదితరులు పాల్గొన్నారు.