
ఐటీ సర్వీసెస్ అకాడమీతో ఉద్యోగావకాశాలు
అమలాపురం రూరల్: జిల్లాలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఐటీ సర్వీసెస్ శిక్షణ అకాడమీ ఏర్పాటు చేసి మూడేళ్లలో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఫ్లెక్సీ వ్యాన్ (యూఎస్‌ఏ) సీఐఓ చిక్కాల విద్యాసాగర్ ముందుకు వచ్చారని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. బుధవారం అమలాపురం కలెక్టరేట్‌లో విద్యాసాగర్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, పరిశ్రమల కేంద్రం సహాయ సంచాలకుడు శివరామ్ ప్రసాద్‌తో సమావేశమై ఈ అకాడమీ ఏర్పాటుపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ అకాడమీని సుమారు రూ. 35 కోట్ల అంచనాతో ఏర్పాటు చే స్తున్నామని, తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా విద్యాసాగర్ కృషి చేస్తామని తెలిపార న్నారు. అమలాపురం నివాసి అయిన విద్యాసాగర్ మాతృ భూమికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకురావడం సంతోషదాయకమన్నారు. ఈ అకాడమీ ఏర్పాటుకు జిల్లాలో సుమారు ఐదెకరా ల విస్తీర్ణంగల భూములు సేకరించాలనితెలిపారు.
మినీ ఫిషింగ్ హార్బర్‌కు వసతులు కల్పించాలి
అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ పూర్తి స్థాయి నిర్వహణ కోసం మౌలిక వసతులను కల్పించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కోరారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ మహేష్ కుమార్ అధ్యక్షతన మినీ ఫిషింగ్ హార్బర్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సుమారు రూ. 30 కోట్లతో చేపట్టిన ఈ మినీ హార్బర్‌లో రూ.23 కోట్లతో పనులు నిర్వహించి 2023లో అప్పగించామని తెలిపారు. మిగిలిన రూ.7 కోట్లకు సంబంధించి విద్యుత్ సరఫరా, తాగునీరు, అప్రోచ్ రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పన జరగాల్సి ఉందని అన్నారు. పూర్తి స్థాయిలో వసతులు కల్పించడం ద్వారా సుమారు 200 పడవలు రాకపోకలు సాగించేందుకు వీలుంటుందన్నారు. అనంతరం కోటిపల్లి– నరసాపురం రైల్వే లైన్, జాతీయ రహదారి 216 తదితర ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ అంశాల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు.