
మేము సైతమంటూ ముందుకొచ్చి..
● పోలీసు కుటుంబాలకు సాయం
● ఎస్పీ కృష్ణారావు చేతుల మీదుగా అందజేత
అమలాపురం టౌన్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎస్సై, కానిస్టేబుల్ కుటుంబాలకు కోనసీమ జిల్లా పోలీసులు మేమున్నామంటూ ముందుకు వచ్చి చేయూత అందించారు. గత నెల 26న విధి నిర్వహణలో భాగంగా ఆలమూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆలమూరు ఎస్సై మద్దాల అశోక్, ఆత్రేయపురం కానిస్టేబుల్ బ్లెస్సన్ జీవన్‌లు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఆయా కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్నవారు మృతి చెందడంతో ఆ కుటుంబాలు పడుతున్న వేదనకు ఓదార్పుగా జిల్లా పోలీసులు అండగా నిలిచారు. వారంతా కలసి రూ.8 లక్షలు సమకూర్చారు. ఈ మేరకు స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ బి.కృష్ణారావు చేతుల మీదుగా ఎస్సై, కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు రూ. 4 లక్షల చొప్పున బుధవారం అందజేశారు. అలాగే 2014 బ్యాచ్‌కు చెందిన ఎస్సైలు కూడా అదే బ్యాచ్‌కు చెందిన ఎస్సై అశోక్ మృతికి చింతిస్తూ రూ.68 వేలను బాధిత కుటుంబానికి ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్, ఎస్పీ కార్యాలయ సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.