
నానాటికీ ప్రభంజనం..
ఆలమూరు: భారతదేశం జన ప్రభంజనం అవుతుంది.. నియంత్రించకుంటే భవిష్యత్ అధోగతిగా మారుతుంది.. చిన్న కుటుంబం– చింతలు లేని కుటుంబం. ఇద్దరు వద్దు.. ఒక్కరు ముద్దు. ఈ నినాదాలకు మళ్లీ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం, ఆవశ్యకత ఏర్పడుతోంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశ జనాభా కేవలం 35 కోట్లు కాగా, 80 ఏళ్ల అనంతరం నాలుగు రెట్లకు పైగా చేరుకుందని అంచనా. రోజు రోజుకూ పెరిగిపోతున్న జనాభా వల్ల నానాటికీ కరిగిపోతున్న వనరులతో భవిష్యత్ తరాలకు ప్రమాదకరంగా మారింది. దీనివల్ల ప్రజలకు మౌలిక సదుపాయాలైన ఆహారం, ఉపాధి, వివిధ అవసరాలు తీర్చడం ప్రభుత్వాలకు భారం అవుతోంది. అధిక జనాభాతో అడవులు సైతం అంతరించి పోతుండగా పంట భూములు ఆవాస ప్రాంతాలుగా మారిపోతున్నాయి. దీనివల్ల పర్యావరణంలో సమతుల్యత లోపించి భవిష్యత్‌లో పుడమికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సామాజికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు ఐక్యరాజ్య సమితి అధిక జనాభా వల్ల కలిగే అనర్థాలను వివరించేందుకు ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తుంది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జాతీయ జనాభా 2011 గణాంకాల ప్రకారం 51,54,296 మంది ఉండగా, ఇందులో 25,69,888 మంది పురుషులు, 25,84,608 మంది సీ్త్రలు ఉన్నారు. అయితే 2025 మార్చి 31 నాటికి ఈ జనాభా సుమారు 55.38 లక్షలుగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. పరిపాలన సౌలభ్యం కోసం ఉమ్మడి జిల్లాను 2022 ఏప్రిల్ 4న అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మూడు జిల్లాలుగా విభజించింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మూడు నియోజకవర్గాలు ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లాలో విలీనం కాగా, రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విలీనం చేశారు. దీంతో జనాభా గణాంకాల్లో తీవ్రమైన వ్యత్యాసం ఏర్పడింది. జిల్లాలో 2001 జనాభా లెక్కల ప్రకారం 10.98 శాతంగా ఉన్న పెరుగుదల 2011కు వచ్చేసరికి 13.86 శాతంగా ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ జనాభా శాతం మరింత పెరిగి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనివల్ల ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కష్టతరం అవుతుంది. జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు ప్రధాన నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం పెరుగుతోంది. పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. అందువల్ల వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.
గణనకు షెడ్యూల్ విడుదల
జనాభా నియంత్రణకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కృషి చేస్తే దేశ భవిష్యత్తు బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2011లో జరిగిన జనగణన తరువాత పదేళ్ల తరువాత 2021లో జరగాల్సి ఉంది. అయితే ఆ సమయంలో కోవిడ్–19 ప్రభావం అధికంగా ఉండటంతో వాయిదా పడుతూ వస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం గణనలో భాగంగా 2026 ఏప్రిల్ ఒకటి నుంచి తొలుత ఇళ్లు, ఆస్తుల వివరాలు నమోదు చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. అనంతరం 2027 ఫిబ్రవరి నుంచి జన, కుల గణనలను ఒకేసారి చేపట్టేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. ఈ జన, కుల, ఆస్తుల గణనలో ప్రతి ఒక్కరి నుంచి 36 ప్రశ్నలకు సంబంధించి సమాచారాన్ని సేకరించనుంది.
ప్రాధాన్యం ఇస్తే మేలు
ఉమ్మడి జిల్లాలో అధిక జనాభా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. జనాభా పెరుగుదలతో కలిగే దుష్ఫరిణామాలను ప్రజలకు వివరించేందుకు ప్రసార మాధ్యమాల్లో ప్రచారం కల్పించాలి. కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి ప్రోత్సాహకాలను అందజేయాలి. సమాజంలో వీలైనంత మేరకు అధిక వయసు పెళ్లిళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. వివాహం చేసుకున్న ప్రతి జంట స్వచ్ఛంద నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది.
అధిక జనాభాతో వనరుల లభ్యత కరవు
2027 ఫిబ్రవరి 1 నుంచి జన, కులగణన
రేపు ప్రపంచ జనాభా దినోత్సవం
జిల్లాల వారీగా జనాభా వివరాలు
జిల్లా జనాభా పురుషులు సీ్త్రలు వైశాల్యం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 17,19,013 8,58,632 8,60,381 2,083 కి.మీ
కోనసీమ
కాకినాడ 20,92,374 10,45,269 10,47,105 3,020 కి.మీ
తూర్పుగోదావరి 18,32,332 9,15,325 9,17,007 2,561 కి.మీ

నానాటికీ ప్రభంజనం..