
కామాక్షీ అమ్మవారికి ఆషాఢం సారె సమర్పణ
అమలాపురం టౌన్: ఆషాఢ మాసం తొలి ఏకాదశి పర్వదినాన అమలాపురం శ్రీకామాక్షీ పీఠంలోని అమ్మవారికి మహిళలు ఆషాఢం సారె సమర్పించారు. పీఠానికి తరచూ వచ్చే మహిళలు ఆషాఢం సారెతో పాటు దాదాపు రూ.లక్ష విలువైన 10 గ్రాముల బంగారు మంగళ సూత్రాలను అమ్మవారికి సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. పట్టణంలోని పలు వీధుల నుంచి మహిళలు చీర సారెతోపాటు బంగారు మంగళ సూత్రాలు, పలు రకాల మిఠాయిలతో పీఠానికి ప్రదర్శనగా వచ్చారు. పీఠం బ్రహ్మ గోవిందవజ్జుల నాగబాబు బ్రహ్మత్వంలో ఉత్తరాధికారి విఘనస రాఖీప్రేమ్ తొలుత కామాక్షీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. కామాక్షీ దేవి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు, పీఠంలోని ప్రేమ మందిరం అమ్మ వక్కలంక వాణి, ట్రస్ట్ సభ్యులు వీరా నాగేశ్వరరావు, మట్టపర్తి సత్యనారాయణ, పీఠం మేనేజర్ మర్రి దుర్గారావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి దంపతులు, కామనగరువు సర్పంచ్ దాసరి అరుణకుమారి దంపతులు పాల్గొన్నారు. మహిళలు సరిపెల్ల అనంతలక్ష్మి, విజయకుమారి, బాలిరెడ్డి రాధిక, వెత్సా రత్నరాధిక తదితరులు కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.
9 నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీ
అమలాపురం రూరల్: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రవాణా వాహనాలు, మోటార్ వాహనాల తనిఖీ అధికారులచే జారీ చేసే ిఫిట్‌నెస్ సర్టిఫికెట్లను ఈ నెల 9 నుంచి ఎ.వేమవరంలో ఏర్పాటైన ఏటీఎస్ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ద్వారా జారీ చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఫిట్‌నెస్ స్లాట్లు అన్ని ఏటీఎస్‌కు బుక్ అవుతాయని, దీనికోసం సాఫ్ట్‌వేర్‌లో సవరణలు చేశారన్నారు. వాహనదారులు, అదేవిధంగా ఆటో, లారీ ఓనర్స్ యూ నియన్లు గమనించి ఏటీఎస్ ద్వారా వాహనాల సామర్థ్య పరీక్షలు చేయించుకుని, ధ్రువీకరణ పత్రాలు పొందాలని ఆయన కోరారు.
నేడు ప్రజా సమస్యల
పరిష్కార వేదిక
అమలాపురం రూరల్: అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద గోదావరి భవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించి సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. 1100 కాల్ సెంటర్‌కు అర్జీదారులు ఫోన్ చేసి తమ ఫిర్యాదుల పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే అడగవచ్చన్నారు. కొత్త ఫిర్యాదులు నమోదు చేయవచ్చని తెలిపారు. అలాగే ప్రజల సౌకర్యార్థం మూడు రెవెన్యూ డివిజన్లలోని 22 మండల కేంద్రాలు, 4 మున్సిపల్ కార్యాలయాల్లో ఈ గ్రీవెన్స్ జరుగుతుందన్నారు. అర్జీదారులు ఆయా స్థాయిల్లో తమ సమస్యలను నమోదు చేసుకుని పరిష్కారం పొందాలన్నారు.