
బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ సభను విజయవంతం చేయాలి
ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ పిలుపు
అమలాపురం టౌన్: వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమలాపురం మండలం ఇందుపల్లిలోని ఎ–కన్వెన్షన్ ఫంక్షన్ హాలులో బుధవారం సాయంత్రం జరగనున్న బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ సభను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పిలుపునిచ్చారు. ఈ సభకు హాజరవుతున్న ఉభయ గోదావరి జిల్లాల పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు పార్టీ శ్రేణులు భారీఎత్తున స్వాగతం పలకాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మంగళవారం స్థానిక మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రతి కుటుంబానికి పథకాల అర్హతతో కూడిన మొత్తం సొమ్ముకు సంబంధించి బాండ్లు అందించిన కూటమి పార్టీల నేతలు.. నేడు ఆయా పథకాలు అమలు చేయకుండా దగా చేశాయని గుర్తు చేశారు. ఎన్నికల్లో బాబు ఇచ్చిన పథకాల ష్యూరిటీ అంతా బోగస్ అని ఇందుపల్లిలో జరిగే సభ ఎండగట్టనుందని వివరించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామంటూ యువతను కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా వంచించిందన్నారు. బాబు ఇచ్చిన హామీలు, మోసాలపై నిలదీసేందుకు నిర్వహిస్తున్న ఈ సభకు జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
అకడమిక్ క్యాలెండర్‌ను అనుసరించాలి
డీఈవో డాక్టర్ సలీం బాషా
ఐ.పోలవరం: ప్రధానోపాధ్యాయుల టేబుళ్లపై అకడమిక్ క్యాలెండర్ ఉండాలని, దానిని హెచ్‌ఎంలు తప్పనిసరిగా అనుసరించాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా ఆదేశించారు. మండలంలోని మురమళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ, పాఠశాలల్లో నూరు శాతం ఎన్‌్‌రోల్‌మెంట్ జరగాలన్నారు. బడి ఈడు పిల్లలందరూ పాఠశాలల్లో చదవాలన్నారు. ప్రతి విద్యార్థికి ఎస్‌ఆర్‌కేవీఎం కిట్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు బోధనాభ్యసన, పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు తరచూ వారి పరిధిలోని పాఠశాలలను పర్యవేక్షించాలన్నారు. పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి, వారిలో విద్యా ప్రమాణాలను పరిశీలించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హెచ్‌ఎం సరెళ్ల సుజాతకు నిర్దేశించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో వండాలని, విద్యార్థులంతా భుజించేలా రుచిగా, శుచిగా వండేలా హెచ్‌ఎం పర్యవేక్షించాలని సూచించారు.

బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ సభను విజయవంతం చేయాలి