యోగాతో ఆరోగ్యం
వాడపల్లిలో యోగాసనాలు వేస్తున్న కలెక్టర్ మహేష్‌కుమార్, ఎమ్మెల్యే బండారు తదితరులు
కొత్తపేట: ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆర్. మహేష్‌కుమార్ పిలుపునిచ్చారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆయుష్ వైద్యుల పర్యవేక్షణలో డివిజన్ స్థాయి యోగాభ్యసనాల కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. యోగాంధ్ర మాసోత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మహేష్‌కుమార్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అధికారులు, సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ 45 నిమిషాల సరళ యోగా సనాలతో బీపీ, మధుమేహం, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యం వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చన్నారు. మహిళలకు, చిన్నారులకు యోగా ఔన్నత్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. యోగ ద్వారా శారీరక శక్తి, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడారు. అనంతరం ఆయుష్ వైద్యులు, ఓం శాంతి యోగా గురువులు వందలాది మందితో యోగాసనాలు వేయించారు. డీఆర్‌ఓ రాజకుమారి, ఆర్‌డీఓ పీ శ్రీకర్, దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, వాడపల్లి దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా, డివిజన్, మండల అధికారులు పాల్గొన్నారు.


