ధాన్యం బకాయి సొమ్ము చెల్లించాలని వినతి
అమలాపురం రూరల్: గత మే నెలలో రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులు విక్రయించిన ధాన్యానికి బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలని కోరుతూ కోనసీమ రైతు పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ మహేష్ కుమార్ కు వినతిపత్రం అందించారు. సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యాళ్ల బ్రహ్మానందం, అయితాబత్తుల ఉమా మహేశ్వరరావు, మంగెన నరసింహరావు, ఎరుబండి లక్ష్మయ్య, అప్పారి చిన వెంకట రమణ, పెమ్మిరెడ్డి సత్యనారాయణ తదితరులు వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ 45 రోజులుగా ధాన్యం సొమ్ము రాలేదని వారు తెలిపారు. జిల్లావ్యాప్తంగా సూమారు రూ.250 కోట్లకుఽపైగా ధాన్యం బకాయిలు ఇవ్వాలని వారు తెలిపారు.
‘తల్లికి వందనం’కు కరెంటు షాక్
ఈఆర్‌ఓ కార్యాలయానికి క్యూ కట్టిన జనం
అమలాపురం రూరల్: తల్లికి వందనం పథకానికి విద్యుత్ షాక్ తగిలింది. నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్ వాడకం ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో లబ్ధిదారులు అమలాపురం ఈదరపల్లిలో ఉన్న ఈఆర్‌ఓ కార్యాలయానికి సోమవారం క్యూ కట్టారు. తమ పేరున విద్యుత్ మీటర్లు లేవని, అయినా తల్లికి వందనం పథకాన్ని నిలిపివేశారని కొందరు వినియోగదారులు వాపోయారు. తండ్రి, తల్లి పేరున ఉన్న విద్యుత్ మీటర్లను తమ ఆధార్‌తో లింక్ చేయడం వల్ల విద్యుత్ వాడకం ఉన్న కారణంగా ప్రభుత్వ పథకాలు రావడం లేదని తెలిపారు. ఆధార్ లింక్ తొలగించాలని కోరారు. ఏడాది విద్యుత్ వాడకం స్టేట్‌మెంట్ ఇవ్వాలని కొందరు విద్యుత్ వినియోగదారులు ఈఆర్‌ఓలను కోరారు. వినియోగదారుల నుంచి లిఖిత పూర్వకంగా విజ్ఞప్తులు తీసుకుని, రెండో రోజులు తర్వాత స్టేట్‌మెంట్లు ఇస్తామని అధికారులు చెప్పారు.


