సీపీవో సేవలు అభినందనీయం
అమలాపురం రూరల్: జిల్లా ప్రణాళికాధికారి పి.వెంకటేశ్వర్లు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 ఏళ్లపాటు వివిధ బాధ్యతలు నిర్వహించి విశిష్ట సేవలు అందించారని అధికారులు ప్రశంసించారు. ఆయన పదవీ విరమణ సందర్భంగా అమలాపురంలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం ఆయనకు ఉద్యోగులు వీడ్కోలు సభ నిర్వహించారు. ప్రణాళికా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మురళి, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి రామకృష్ణారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కృష్ణారెడ్డి, జిల్లా పశుసంవర్ధక అధికారి వెంకట్రావు మాట్లాడుతూ ప్రణాళికా అమలు, గణాంక విశ్లేషణ, అభివృద్ధి కార్యక్రమాల సమన్వయంలో విశేష దక్షత చూపారని అన్నారు. 2022లో నూతనంగా ఏర్పడిన అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు గుంటూరు నుంచి బదిలీపై వచ్చిన వెంకటేశ్వర్లు, జిల్లా ప్రణాళికాధికారిగా అమలాపురంలో విశిష్ట సేవలు అందించారని అన్నారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కోనసీమ జిల్లాకు బదిలీ అయిన తరువాత కొత్తగా ఏర్పడిన జిల్లా కార్యాలయ వ్యవస్థను పునాది నుంచి ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రారంభంలో తాను నివసిస్తున్న ఇంట్లోనే కార్యాలయం ప్రారంభించి, తర్వాత కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెంకటేశ్వర్లు దంపతులతోపాటు పదవీ విరమణ పొందిన డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆర్.శంకర్‌రావును కూడా సత్కరించారు.


