కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడదాం..
● వైఎస్సార్ సీపీ ముఖ్య నేతల పిలుపు
● పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమీక్ష
రావులపాలెం: కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన నిలబడి పోరాడదామని వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు, పెద్దలు సూచించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన పార్టీ సంస్థగత నిర్మాణంపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గోపాలపురంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా నాయకులు, నియోజవర్గ ఇన్‌చార్జులు హాజరయ్యారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కమిటీ, అనుబంధ విభాగాల కమిటీల నియామకం గురించి చర్చించారు. అలాగే వచ్చే నెల 4న నిర్వహించనున్న ప్రభుత్వ వైఫల్యాలపై జరిగే కార్యక్రమాల గురించి మాట్లాడారు. అనంతరం ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై గట్టిగా పోరాడి ప్రజల పక్షాన నిలబడాలని నాయకులు నిర్ణయించారు. సమావేశంలో అమలాపురం పార్లమెంటరీ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, పీఏసీ సభ్యులు పినిపే విశ్వరూప్, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, నియోజకవర్గ కోఆర్డినేటర్లు పొన్నాడ సతీష్ కుమార్, గొల్లపల్లి సూర్యారావు, పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్యప్రకాష్, గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి పాల్గొన్నారు.


