
ఖరీఫ్ ఆశలపై నీళ్లు!
ఆలస్యమే రబీ
నష్టాలకు కారణం
గత ఏడాది ఖరీఫ్ సమయంలో సాధారణ ఎన్నికలు జరిగాయి. జూన్ 1న నాటికి పోలింగ్ పూర్తయ్యి కౌంటింగ్ జరగాల్సి ఉంది. అయినప్పటికీ అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జూన్ 1వ తేదీకి నీరు విడుదల చేసింది. ముందస్తు సాగుకు అనుకూలంగా నీరు విడుదల చేసినా శివారు రైతులు ఆలస్యంగా సాగు ఆరంభించారు. దీనివల్ల అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తి కావాల్సిన ఖరీఫ్ కోతలు డిసెంబర్ మొదటి వారం వరకు సాగాయి. భారీ వర్షాల వల్ల పంట దెబ్బతింది. ఈ ప్రభావంతో రబీ ఆలస్యమైంది. జిల్లాలో ఫిబ్రవరి మొదటి వారంలో కూడా నాట్లు వేశారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తి కావాల్సిన కోతలు ఇప్పటికీ పూర్తి కాలేదు. జిల్లాలో ఉప్పలగుప్తం, కాట్రేనికోన, అల్లవరం, అమలాపురం, మామిడికుదురు, మలికిపురం మండలాల్లో ఇంకా కోతలు అవుతూనే ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాల వల్ల చేలు దెబ్బతినడం, మెషీన్ కోతలు నిలిచిపోవడం, ధాన్యం రాశులు తడిసిపోయి రైతులు కనీస మద్దతు ధర కూడా పొందలేకపోవడం వంటి పరిణామాలు జరిగాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం జూన్ 10 తరువాత నీరు విడుదల చేస్తే ఖరీఫ్, రబీ ఆలస్యమై ఈ ఏడాది కూడా నష్టపోయే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తున్నట్టయ్యిందని రైతులు వాపోతున్నారు.
సాక్షి, అమలాపురం: కోటి ఆశల ఖరీఫ్‌కు వాతావరణం సహకరించినా జిల్లాలో నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం మోకాలు అడ్డే పరిస్థితి నెలకొంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి ఖరీఫ్ పంటను గట్టెక్కించడం, రబీ సాగు నీటి ఎద్దడి బారిన పడకుండా చూడడం, మూడవ పంటగా అపరాలు సాగు చేయించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చేయడం వంటి ఉన్నత లక్ష్యాలకు అనుగుణంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఖరీఫ్‌లో ముందస్తు సాగును ప్రోత్సహించింది. కాని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఖరీఫ్, రబీ నీటి విడుదలపై నిర్లక్ష్యం కమ్ముకుంది. పంట కాలువలపై మొదలు పెట్టిన పనులు ఇంకా ప్రాథమిక దశలో ఉండడంతో నీటి విడుదల ఆలస్యమవుతోంది. ఆ ప్రభావం ఖరీఫ్ సాగుపై పడనుంది. జిల్లాలో 2,52,742 ఎకరాల రిజిస్టర్ ఆయకట్టు ఉండగా, 2,46,155 ఎకరాల నికర ఆయకట్టు. దీనిలో 1.70 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు జరుగుతోందని అంచనా.
జిల్లాలో మూడు రోజుల నుంచి వర్షం
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది అనుకున్న సమయం కన్నా ముందే వస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. అందుకు తగినట్టుగానే రుతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళను తాకనున్నాయి. తొలకరి ఇంకా రాకున్నా జిల్లాను వర్షాలు పలకరించాయి. గడిచిన మూడు రోజులుగా రోజూ క్రమం తప్పకుండా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడుతూనే ఉంది. జిల్లాలో ఈ నెల 20వ తేదీన 21 మి.మీటర్లు, 21న 17.2 మి.మీటర్లు, 22న 12.1 మి.మీటర్లు, 23న 17.9 మి.మీటర్ల చొప్పున వర్షం కురిసింది. జిల్లాలో గురువారం అత్యధికంగా 39.2 మి.మీటర్ల వర్షం కురిసింది. నిప్పులు కురిపించే ఎండల నుంచి ఉపశమనం కల్పిస్తూ వాతావరణం చల్లబడింది. ఈ పరిణామాలు ముందుస్తు ఖరీఫ్‌కు శుభారంభం.
గత ప్రభుత్వంలో ముందస్తు సాగు
కానీ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా డెల్టా కాలువలకు ముందస్తు సాగునీరు పంపిణీ చేసే ఉద్దేశంలో కూటమి ప్రభుత్వం లేకపోవడం ఆయకట్టు రైతులను నిరాశకు గురి చేస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మూడేళ్ల కాలంలో గోదావరి డెల్టాలో ముందస్తు సాగుకు అనుకూలంగా జూన్ ఒకటో తేదీన పంట కాలువలకు నీరు విడుదల చేసేవారు. గోదావరి డెల్టా పరిధిలో ఒకటి, రెండు రోజులు అటూఇటూగా తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు సాగునీరు విడుదల చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కనీసం రైతులు తరఫున గళం వినిపించేవారే లేకుండా పోయారు.
క్లోజర్ పనులు నత్తనడక
క్లోజర్ సమయంలో చేపట్టిన పనులు అరకొరగా సాగుతున్నా ఆ పనులు కూడా ఆలస్యంగా మొదలు పెట్టారు. జిల్లాలో తూర్పు, మధ్య డెల్టాలో కలిపి మొత్తం రూ.ఐదు కోట్ల లోపు పనులు జరుగుతున్నాయి. కాలువలను ఏప్రిల్ 15న మూసివేస్తామన్న అధికారులు రైతుల కోరిక మేరకు 20వ తేదీ వరకు పెంచారు. తరువాత చేపల సాగు చేసే రైతులు కాసులు చెల్లించడంతో గడువును దఫదఫాలుగా పెంచుకుంటూ 27వ తేదీ వరకు నీరు విడుదల చేస్తూనే ఉన్నారు. ఆ తరువాత కూడా వెంటనే పనులు మొదలు పెట్టలేదు. చాలా ఆలస్యంగా పనులు మొదలు పెట్టగా, దీనికితోడు గత పక్షం రోజులలో పలు సందర్భాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో క్లోజర్ పనులు ఎక్కడికక్కడ నిలిపోయాయి. ఆత్రేయపురం మండలం లొల్ల లాకు దిగువన కల్వర్టుల నిర్మాణం మధ్యలో ఉంది. అమలాపురంలో బెండా కెనాల్ మీద ఈదరపల్లి, నడిపూడి వద్ద వంతెనల నిర్మాణం ఇంకా పునాది దశలోనే ఉంది. ఇవికాకుండా మామిడికుదురు, కాట్రేనికోన వంటి ప్రాంతాల్లో పూడిక తొలగింపు పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ఈ పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తి కావడం అసాధ్యమని సాగునీటి పారుదల శాఖ అధికారులే చెబుతున్నారు. పరిస్థితి చూస్తుంటే కనీసం జూన్ పదవ తేదీ నాటికై నా నీరు విడుదల చేస్తారనే నమ్మకం ఆయకట్టు రైతులకు కలగడం లేదు.
23ఎఎంపీ02: ఆత్రేయపురం మండలం లొల్ల వద్ద మధ్యలో ఉన్న క్లోజర్ పనులు
ఆత్రేయపురం మండలం లొల్ల వద్ద
మధ్యలో ఉన్న క్లోజర్ పనులు
సాగుకు అడుగడుగునా అవాంతరాలే..
తొలకరి కన్నా
ముందే పలకరించిన వర్షాలు
వాతావరణం ముందస్తు
సాగుకు అనుకూలం
జూన్ 1కి కాలువలకు
నీరు వదలడం అసాధ్యం
10వ తేదీకి ఇస్తే గొప్పే అంటున్న రైతులు

ఖరీఫ్ ఆశలపై నీళ్లు!