
కూటమి ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోంది
అమలాపురం రూరల్: మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇప్పటివరకు కూటమి సంకీర్ణ ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతం కుమార్ అన్నారు. అమలాపురం ఈదరపల్లి అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్‌లో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు కుసుమ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన బహుజన సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్ ప్రజల ఆస్తులు అమ్మి ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు ప్రజలకు సూపర్ సిక్స్‌తో మోసపూరిత హామీలను ఇచ్చారన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు భూమి పంపిణీ చేయకుండా తాత్కాలిక పథకాలతో మభ్యపెడుతూ పేదరికంలోనే ఉంచుతున్నారని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి కొల్లబత్తుల సత్యం, నాయకులు గెడ్డం సంపత్‌రావు, అశోక్ ఉమ్మడి జిల్లాల ఈసీ మెంబర్ బత్తుల లక్ష్మణరావు, జిల్లా ఇన్‌చార్చి కె లక్ష్మీ భవాని పాల్గొన్నారు.
పాస్టర్ ప్రవీణ్ సంస్మరణ
సభకు అనుమతి లేదు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నగరంలో శనివారం నిర్వహించ తలపెట్టిన పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ సభకు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ హైకోర్టు అనుమతి కోరారన్నారు. దీనిపై నిర్ణయం వెలువడనందువలన అనుమతి లేదని, సభకు వచ్చే వారు విషయం గమనించాలని ఎస్పీ పేర్కొన్నారు.