
మోసపూరిత హామీలు బాబుకు అలవాటే
ఉప్పలగుప్తం: ప్రతి ఎన్నికలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, వచ్చిన తరువాత వాటిని గాలికొదిలేయటం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అలవాటేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగా గిరిజకుమారి విమర్శించారు. మండలంలోని సన్నవిల్లి గ్రామంలో ఆమె స్వగృహంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మోసపూరిత హామీలతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తోందన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా 18 నుంచి 59 సంవత్సరాలు కలిగిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున సంవత్సరానికి రూ.18,000 అందిస్తానని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చాక హామీ అమలు చేయడానికి డబ్బు లేదంటున్న చంద్రబాబుకు ఎన్నికల మేనిఫెస్టోలో పథకాన్ని పెట్టేముందు ఆ విషయం తెలియదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ చేయూత పథకంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో 45 సంవత్సరాలు దాటిన మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా సంవత్సరానికి రూ.18,750 చొప్పున నాలుగు సంవత్సరాల్లో రూ.75,000, కాపు మహిళలకు సంవత్సరానికి రూ.15వేలు అందించి, ఆర్థికంగా ఆదుకున్న ఘనత మాజీ ముఖ్యమంత్రి జగనన్నకు దక్కిందని అన్నారు.