
వైద్యం వికటించి చిన్నారి మృతి
రౌతులపూడి: మండలంలోని గిడజాం గ్రామానికి చెందిన చక్కా హర్షవర్ధన్ (11నెలలు) వైద్యం వికటించి మంగళవారం మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు వారు, గ్రామస్తులు గిడజాంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ ఘటనపై రౌతులపూడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గిడజాం గ్రామానికి చెందిన హర్షవర్ధన్ ఆరోగ్య పరీక్షల కోసం తల్లితండ్రులు సంధ్య, నాగదుర్గాప్రసాద్ మంగళవారం రౌతులపూడి సినిమా సెంటర్లో ఒక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకువెళ్లారు. వైద్యుడు ఇందన బ్రహ్మానందం బాలుడిని పరీక్షించి ఇంజెక్షన్, మందులు ఇచ్చారు. ఇంటికివెళ్లి బాలుడికి మందులు వేయగా కొంతసేపటికి ఎగఊపిరి వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో కంగారుపడ్డ తల్లితండ్రులు రౌతులపూడి సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ఆసుపత్రి వైద్యులు బాలుడిని పరీక్షించి మృతిచెందినట్లు తెలిపారు. దీంతో ఆగ్రహం చెందిన బాలుడు తల్లితండ్రులు, కుటంబసభ్యులు గిడజాంలో రోడ్డుపై ఆందోళన చేశారు. అనంతరం రౌతులపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

వైద్యం వికటించి చిన్నారి మృతి