
మల్లాంలో దళితుల సాంఘిక బహిష్కరణ దారుణం
అమలాపురం టౌన్: రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామంలో దళితుల సాంఘిక బహిష్కరణ అత్యంత దారుణం. ఇది ముమ్మూటికీ సాంఘిక నేరమేనని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు డీబీ లోక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పవన్ కల్యాణ్ బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమలాపురం ఆరిగెలపాలంలో సోమవారం జరిగిన ఆర్‌పీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో లోక్ మాట్లాడారు. పవన్‌కల్యాణ్ రాజీనామా చేయని పక్షంలో ఆర్‌పీఐ రాష్ట్ర వ్యాప్తంగా మల్లాం ఘటనపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. సనాతన ధర్మం ఆచరణలో భాగంగానే పవన్ కల్యాణ్ ఇదంతా చేయిస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయని ఆరోపించారు. మల్లాంలో బహిష్కరణ విధించిన దళితులకు నిత్యావసర వస్తువుల అమ్మకాలు నిలిపివేయాలని ఆంక్షలు విధించడాన్ని లోక్ ఖండించారు. మునపటి మనుధర్మ శాస్త్ర నిబంధనలు, సనాతన ధర్మ లక్షణాలను హైందవ పెద్దలు పాటిస్తున్నట్లు ఈ ఘటన తీరు తేటతెల్లం చేస్తోందన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో దళితుల ఇళ్లను ముందస్తు హెచ్చరికలు లేకుండా కూల్చివేస్తున్నారని అన్నారు. మల్లాం ఘటనను చూస్తుంటే రాష్టంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా...? అనే సందేహం కలుగుతోందని లోక్ పేర్కొన్నారు. ఆర్‌పీఐ నాయకుడు పెయ్యల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు కె.సత్యనారాయణ, పి.సత్యనారాయణ, పండు రాజేష్, ఉండ్రు శ్యామలరావు, ఈవీవీ సత్యనారాయణ, డి.రాంజీ ప్రసంగించి మల్లాం ఘటనను తీవ్రంగా ఖండించారు.
రైల్వే లైన్‌కు భూసేకరణ
అడ్డంకులు తొలగించాలి
కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మకు
కేఆర్‌ఎస్‌ఎస్ వినతి
అమలాపురం టౌన్: కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్‌కు భూసేకరణ అడ్డంకులను తొలగించి పనులను వేగవంతమయ్యేలా చర్యలు చేపట్టాలని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మకు కోనసీమ రైల్వే సాధన సమితి (కేఆర్‌ఎస్‌ఎస్) ప్రతినిధులు బృందం విజ్ఞప్తి చేసింది. అమలాపురానికి సోమవారం వచ్చిన కేంద్ర మంత్రిని స్థానిక గంగరాజు ఫంక్షన్ హాలు వద్ద కేఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధుల బృందం కలసి కోనసీమ రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని వినతి పత్రం అందించింది. కేఆర్‌ఎస్‌ఎస్ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కమిటీ ప్రతినిధులు కోనసీమ రైల్వే లైన్ ప్రాజెక్ట్ పనులపై కేంద్రమంత్రితో చర్చించారు. రెండు దశాబ్దాలకు పైగా ఈ రైల్వే పనులు నత్తనడకన సాగుతున్నాయని, నిధులు పరంగా ఇబ్బంది లేదని, భూసేకరణ పరంగానే ఇబ్బందులతో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమకు రైలు వచ్చే వరకూ అమలాపురంలో రెండు దశాబ్దాలుగా ఉన్న రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌ను మున్సిపల్ సర్క్యులర్ బజార్‌లో పునరుద్ధరించాలని కోరారు. ఏడాదిన్నర కిందట ఈ కౌంటర్‌ను తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. కేఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు కల్వకొలను తాతాజీ, సప్పా నాగేశ్వరరావు, ఉప్పుగంటి భాస్కరరావు, ఆర్‌వీ నాయుడు, వై.వెంకటేశ్వరావు, పి.సాంబశివరావు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
దివ్యాంగులకు 800 టీచర్ పోస్టులు కేటాయించాలి
అమలాపురం టౌన్: డీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొన్న 16,437 పోస్టుల్లో కనీసం 800 పోస్టులు అర్హులైన దివ్యాంగులకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ దివ్యాంగ మహా సంఘటన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు దొడ్డిపట్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తన రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా అమలాపురానికి సోమవారం వచ్చిన శ్రీనివాస్‌ను కోనసీమ దివ్యాంగ మహా సంఘటన్ నాయకులు డీఎస్సీ నోటిఫికేషన్‌లో దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయంపై వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2116 దివ్యాంగుల చట్టం ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్‌లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగ మహా సంఘటన్ ప్రతినిధి నిమ్మకాయల సురేష్, దివ్యాంగ సంఘాల నాయకులు పెనుమాల నాగరాజు, ర్యాలి శ్రీనివాస్, పరశురాముడు, సంపత్ కుమార్ శ్రీనివాస్‌కు వినతి పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.
● డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
రాజీనామా చేయాలి
● ఆర్‌పీఐ రాష్ట్ర అధ్యక్షుడు డీబీ లోక్ డిమాండ్