అమలాపురం రూరల్: ఆయకట్టు చివరి భూముల వరకూ సాగునీరు అందేలా క్రాస్‌బండ్‌లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సాగునీటి ఎద్దడిపై జలవనరులు, డ్రైనేజీ, వ్యవసాయ అధికారులతో కలెక్టరేట్‌లో శనివారం ఆయన సమీక్షించారు. క్షేత్ర స్థాయి ఏఈలు ఏఓలు సమన్వయంతో పని చేసి, నీటి ఎద్దడి సమస్యను అధిగమించాలన్నారు. సాగునీటి సరఫరాపై ఏప్రిల్ 15 వరకూ అప్రమత్తంగా ఉండాలని, పంటలను కాపాడుకునేలా రైతులకు తోడ్పడాలని సూచించారు. ఆర్‌డీఓలు మండలాల వారీగా నివేదిక రూపొందించి, సాగునీరు సమృద్ధిగా అందేలా ప్రతి వారం రెండుసార్లు పర్యవేక్షించాలకాదేశించారు. రాజోలు మండలంలో సుమారు 70 ఎకరాలు, అమలాపురం 96 ఎకరాలు, ఉప్పలగుప్తం 100 ఎకరాలు, అల్లవరం 80 ఎకరాలు, మామిడికుదురు 100 ఎకరాలు, అంబాజీపేట మండలం చివరి ఆయకట్టులో 100 ఎకరాల్లో సాగునీటి సమస్య నెలకొందని కలెక్టర్ మహేష్ కుమార్ వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి, ఆర్‌డీఓలు దేవరకొండ అఖిల, కె.మాధవి, పి.శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.
సీలేరు నుంచి
9,300 క్యూసెక్కులు
సీలేరు: గోదావరి డెల్టాలో రబీ సాగుకు సీలేరు కాంప్లెక్స్ నుంచి 9,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏపీ జెన్‌కో అధికారులు తెలిపారు. రబీ నీటి ఎద్దడి నేపథ్యంలో గోదావరి డెల్టాకు సీలేరు జలాలను విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు గతంలో కోరారు. ఈ మేరకు డొంకరాయి నుంచి 5 వేలు, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం నుంచి 4,300 క్యూసెక్కులు కలిపి మొత్తం 9,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని జెన్‌కో అధికారులు వివరించారు. గత ఫిబ్రవరి 10వ తేదీ నుంచి శనివారం వరకూ గోదావరి డెల్టాకు 10.19 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు. ఈ నెల 31 వరకూ నీటిని విడుదల చేయనున్నామని వారు తెలిపారు.
డీఆర్‌డీఏ పీడీగా జయచంద్ర
ముమ్మిడివరం: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ)గా టి.సాయినాథ్ జయచంద్ర శనివారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ డ్వామాలో పని చేస్తున్న ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకూ పీడీగా పని చేసిన శివ శంకర ప్రసాద్ రాష్ట్ర డైరక్టర్‌గా పదోన్నతిపై వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన జయచంద్రకు సెర్ప్ ఉద్యోగులు, జిల్లా యూనియన్ నాయకులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు దేవ వరాలబాబు, కార్యదర్శి ముత్తాబత్తుల వెంకటేశ్వరరావు, కోశాధికారి భూపతివర్మ, మహిళా విభాగం నాయకురాలు పాటి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ పేరు
తొలగింపు దుర్మార్గం
అల్లవరం: విశాఖపట్నంలోని క్రికెట్ స్టేడియానికి వైఎస్సార్ పేరును తొలగించడం దుర్మార్గమని మాజీ ఎంపీ చింతా అనురాధ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాసేవతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా యావత్తు దేశంలోనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కీర్తి పొందారని గుర్తు చేశారు. సంక్షేమ ప్రదాతగా, అపర భగీరథునిగా ప్రజల హృదయాల్లో చిరంజీవిగా స్థానం సంపాదించుకున్నారని అన్నారు. అధికారం చేతిలో ఉందనే అహంకారంతో వైఎస్సార్ పేరును ప్రభుత్వం కుట్రపూరితంగా తొలగించిందన్నారు. కడప జిల్లాకు ఎంతో గుర్తింపు తెచ్చిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహర్‌రెడ్డి ఎంతో గుర్తింపునిచ్చి, ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టారని గుర్తు చేశారు. వైఎస్సార్, ఎన్టీఆర్‌లకు సముచిత స్థానం కల్పించిన నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పేరు మార్చే దమ్ము చంద్రబాబుకుందా అని ప్రశ్నించారు. పేర్లు మార్చుతూ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కూటమి ప్రభుత్వానికి వారు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని అనురాధ పేర్కొన్నారు.
శివారు భూములకు నీరందించాలి