మహిళలను మోసగించిన సర్కార్‌ ˘ | - | Sakshi
Sakshi News home page

మహిళలను మోసగించిన సర్కార్‌ ˘

Mar 19 2025 12:11 AM | Updated on Mar 19 2025 12:10 AM

శాసన మండలిలో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్‌

అల్లవరం: అధికారంలోకి వస్తే 50 ఏళ్ల వయస్సు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నెలకు రూ.4 వేల పింఛన్‌ పథకాన్ని వర్తింపజేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం విస్మరించిందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ అన్నారు. ప్రభుత్వ తీరును శాసన మండలిలో మంగళవారం ఆయన ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలవుతున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పింఛన్లు ఏవని ప్రశ్నించారు. ఈ పథకం కింద బడ్జెట్‌లో కేటాయింపులు చేయకుండా మహిళలను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో 65,49,864 మందికి పింఛన్లు పంపిణీ చేయగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఖ్య 63,53,907కు తగ్గిందని తెలిపారు. రెండు లక్షల పెన్షన్లు కోత పెట్టారని విమర్శించారు. ప్రతి నెలా పెన్షన్లు తీసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో పింఛన్ల పంపిణీకి రూ.32,634 కోట్లు అవసరం కాగా, బడ్జెట్‌లో రూ.27,512 కోట్లు మాత్రమే కేటాయించారని, దీనినిబట్టి భవిష్యత్‌లో చాలా పెన్షన్లను తొలగించే అవకాశం ఉందని చెప్పకనే చెబుతున్నారన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనే ఉద్దేశంతో చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు దాటిన వారికి ఏడాదికి రూ.18,750 చొప్పున ఐదేళ్ల పాటు అందించి వేలాది కుటుంబాలకు గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పించారని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మహిళలను అన్ని విధాలా ఆదుకుంటే, కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోందని ఇజ్రాయిల్‌ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సీఎస్‌, హెచ్‌ఎంలపై

శాఖాపరమైన చర్యలు

అమలాపురం రూరల్‌: పదో తరగతి పరీక్ష ప్రారంభానికి కొన్ని గంటల ముందు సోమవారం అమలాపురం నల్లవంతెన సమీపంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నుంచి సిమెంట్‌ బస్తాలు తరలించడంపై జిల్లా అధికారులు సీరియస్‌ అయ్యారు. ఈ విషయమై ఆర్‌డీఓ కె.మాధవి, జిల్లా విద్యా శాఖాధికారి (డీఈఓ) షేక్‌ సలీం బాషాను విచారణాధికారులుగా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ నియమించారు. ఈ విచారణలో పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ (సీఎస్‌) మీనాకుమార్‌, ప్రధానోపాధ్యాయుడు గౌరీశంకర్‌ అలసత్వం ప్రదర్శించినట్లు వెల్లడైంది. దీంతో వారిద్దరిపై శాఖాపరమైన చర్యలకు కలెక్టర్‌ ఆదేశించారని డీఈఓ తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఇద్దరినీ హెచ్చరించామని తెలిపారు.

మూల్యాంకనంలో

స్క్రూటినైజర్లు కీలకం

అమలాపురం టౌన్‌: మూల్యాంకనంలో స్క్రూటినైజర్ల పాత్ర కీలకమని జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యా శాఖాధికారి (డీఐఈఓ) వనుము సోమశేఖరరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో జరుగుతున్న ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనంలో స్క్రూటినైజేషన్‌ మంగళవారం ఆరంభమైందని తెలిపారు. కళాశాలలో స్క్రూటినైజర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు దిద్దిన పేపర్లను చీఫ్‌ ఎగ్జామినర్లు పరిశీలిస్తారని, తర్వాత అవే పేపర్లను మరోసారి స్క్రూటినైజర్లు ఆద్యంతం తనిఖీ చేస్తారని చెప్పారు. జవాబు పత్రంలో అన్ని జవాబులూ దిద్దారా, మార్కులు వేశారా, లేదా అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తారని చెప్పారు. పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎటువంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత స్క్రూటినైజర్లదేనని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో మూల్యాంకన పర్యవేక్షకులు వై.లక్ష్మణరావు, అడబాల శ్రీనివాస్‌, స్కానింగ్‌ ఇన్‌చార్జి ఇ.సువర్ణకుమార్‌తో పాటు వివిధ కళాశాలలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు.

మహిళలను  మోసగించిన సర్కార్‌ ˘
1
1/1

మహిళలను మోసగించిన సర్కార్‌ ˘

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement