
బాలాజీకి రూ.1.88 లక్షల ఆదాయం
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయానికి ఆదివారం భారీగా భక్తులు తరలి వచ్చారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు సమర్పించారు. ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి తమ కోర్కెలు నెరవేరాలని స్వామి వారిని వేడుకున్నారు. ఆపద మొక్కుల వాడా.. అనాథ రక్షకా.. గోవిందా, గోవిందా అంటూ శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువు తీరిన శ్రీబాల బాలాజీ స్వామిని దర్శించుకుని ఆనంద పరవశులయ్యారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.1,88,511 ఆదాయం వచ్చింది. స్వామి వారి నిత్య అన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.43,277 విరాళంగా అందించారు. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.27,600 ఆదాయం వచ్చింది. స్వామి వారిని 3,500 మంది భక్తులు దర్శించుకున్నారు. 1,500 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారని ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు.