
ప్రజలతో మరింతగా మమేకం
● జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ
ఆవిర్భావ దినోత్సవం
● పార్టీ జెండా ఆవిష్కరణలు,
కేక్‌లు కట్ చేసి ఆనందోత్సవాలు
● పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ,
కో ఆర్డినేటర్లతో నిర్వహణ
అమలాపురం టౌన్: వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం జిల్లా వ్యాప్తంగా బుధవారం పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ ఆనందోత్సవాలతో సాగింది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలు సరి కొత్త చైతన్యంతో జరిగాయి. ప్రజలతో మరింత మమేకమై వారికి ఈ కూటమి ప్రభుత్వంలో అందని ద్రాక్షగా మిగిలిన సంక్షేమాన్ని అందేలా పోరాడదామని నాయకులు స్పష్టం చేశారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్‌లు కట్ చేసి ఉత్సవాలు నిర్వహించారు. మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పలు వితరణ కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలనతో ప్రజలు అందుకున్న సంక్షేమాన్ని పార్టీ కో ఆర్డినేటర్లు గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వాన్ని సంక్షేమ రాజ్యంగా కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంక్షేమ పథకాలు అందక పడుతున్న అవస్థలను ప్రస్తావించారు. మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. తమ మండలాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించిన మండల పార్టీ నాయకులు ర్యాలీలు, ప్రదర్శనలతో నియోజకవర్గ కో ఆర్డినేటర్ చేపట్టిన వేడుకలకు హాజరయ్యారు. అమలాపురం హైస్కూలు సెంటర్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సెంటర్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కొత్తపేట నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెంలోని కళా వెంకట్రావు సెంటర్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేశారు. దివంగత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివంగత డాక్టర్ చిర్ల సోమసుందరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముమ్ముడివరంలోని పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేశారు. రామచంద్రపురం గాంధీ సెంటర్‌లో పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కె.గంగవరం సెంటర్‌లో కేక్ కట్ చేశారు. రాజోలు పార్టీ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మామిడికుదురులోని బోయి భీమన్న కమ్యూనిటీ హాలు వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేశారు. మాజీ సీఎం దివంగత రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పి.గన్నవరం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి పి.గన్నవరం, అంబాజీపేటల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. ఆ రెండు మండల కేంద్రాల్లో వారు పార్టీ జెండాలను ఆవిష్కరించారు. రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజోలు, మండపేట నియోజకవర్గాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.