150 కేజీల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

150 కేజీల గంజాయి పట్టివేత

Mar 12 2025 7:44 AM | Updated on Mar 12 2025 7:40 AM

రూ.7లక్షల 50 వేలు విలువైన సరకు స్వాధీనం

ఐదుగురి అరెస్టు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): లక్షల రూపాయల గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనిని రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి జైలుకు పంపారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్‌ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలను వెల్లడించారు.

పట్టుబడిందిలా...

ఉదయం 11 గంటల సమయం. ఏజెన్సీ నుంచి రాజమహేంద్రవరం మీదుగా గంజాయి రవాణా అవుతుందని పక్కా సమాచారం ఉండడంతో రూరల్‌ ప్రాంతంలోని కొంతమూరు గామన్‌ ఇండియా బ్రిడ్జి వద్ద పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. అయితే నిందితులు ముందస్తుగా గంజాయి తరలించే వాహనానికి ఒక ఆటోను పైలట్‌గా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఆటోలో వారు గంజాయి తీసుకెళ్తున్న మార్గంలో పోలీసులు తనిఖీలు చేస్తుంటే ఆ సమాచారాన్ని వారికి సమాచారం ఇస్తారు. అలా రంపచోడవరం నుంచి ఎయిర్‌పోర్టు రోడ్డులో వస్తూ వంతెన కింద నుంచి నేషనల్‌ హైవే 16 పైకి ఎక్కుతుండగా పైలట్‌ ఆటోలో వారు పోలీసులను గమనించి ఆ సమాచారం గంజాయి రవాణా అవుతున్న వాహనంలో ఉన్న వారికి సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన గంజాయి రవాణాదారులు పారిపోతుండగా రాజానగరం పోలీస్‌స్టేషన్‌ ఎస్సై మనోహర్‌, పోలీసు సిబ్బంది ఆ కారును, ఆటోను వెంబడించి పట్టుకున్నారు. మొత్తం రెండు కేజీల చొప్పున 75 ప్యాకెట్లలో కారు ఢిక్కీలో గంజాయి దొరికింది. పట్టుకున్న గంజాయి విలువ రూ.7 లక్షల 50 వేలు ఉంటుందని పోలీసుల తెలిపారు. దీనిని రవాణా చేస్తున్న ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి చెందిన షేక్‌ ఇంతియాజ్‌, సింగరాయికొండకు చెందిన షేక్‌ అబ్దుల్‌, ఏఎస్‌ఆర్‌ జిల్లా రంపచోడవరం మండలం సీతంశెట్టినగర్‌కు చెందిన సంకురు బుచ్చిరెడ్డి, రెడ్డీపేట సంతమార్కెట్‌కు చెందిన ముర్ల చిన్నారెడ్డి, బూసిగ్రామానికి చెందిన ఉలుగుల రవికిరణ్‌రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 సెల్‌ఫోన్లను స్వాఽఽధీనం చేసుకున్నారు. గంజాయి ఎవరు సరఫరా చేస్తున్నారు, ఎవరికి అమ్ముతున్నారు అనే విషయాలను దర్యాప్తు చేస్తామని ఎస్పీ డి.నరసింహాకిశోర్‌ తెలిపారు. నార్త్‌జోన్‌ డీఎస్పీ వై.శ్రీకాంత్‌ పర్యవేక్షణలో గంజాయి పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రాజానగరం సీఐ వీరయ్యగౌడ్‌, ఎస్సై పి.మనోహర్‌, కానిస్టేబుల్స్‌ రమణ, నాగేశ్వరరావు, కరీముల్లాఖాదర్‌లను ఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement