గొంతు దాటనినిరసన గళం | - | Sakshi
Sakshi News home page

గొంతు దాటనినిరసన గళం

Mar 10 2025 12:05 AM | Updated on Mar 10 2025 12:05 AM

గొంతు

గొంతు దాటనినిరసన గళం

అంగన్‌వాడీల ధర్నాకు అనుమతి లేదు

చలో విజయవాడ ధర్నాకు అంగన్‌వాడీ కార్యకర్తలు చేసుకున్న దరఖాస్తును ప్రభుత్వం ఆమోదించలేదు. సోమవారం నిర్వహించే ధర్నా, నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదు. అంగన్‌వాడీ కార్యకర్తలందరూ మండల కేంద్రాల్లో నిర్వహించే సెక్టార్‌ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలి. అంగన్‌వాడీ సహాయకులు అంగన్‌వాడీ కేంద్రాలను తెరచిఉంచాలి. అంగన్‌వాడీలు సరైన కారణం లేకుండా సెలవు తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

– బి.శాంతకుమరి, పీడీ, ఐసీడీఎస్‌, అమలాపురం

అంగన్‌వాడీల ఉద్యమంపై ఉక్కుపాదం

చలో విజయవాడ భగ్నానికి

ప్రభుత్వం కుట్ర

సెక్టార్‌ సమావేశాలకు

హాజరుకావాలని అధికారుల హుకుం

విధులకు గైర్హాజరైతే

చర్యలు తప్పవని హెచ్చరిక

పోలీసుబెదిరింపులతో అణచివేసే యత్నం

ఆలమూరు/రాయవరం: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న తమ న్యాయబద్దమైన డిమాండ్ల సాధన కోసం రాజ్యాంగబద్ధంగా ధర్నా చేసేందుకు ఉపక్రమిస్తున్న అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన చలో విజయవాడను భగ్నం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కుయుక్తులు పన్నుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తొమ్మిది నెలల్లోనే ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుంది. దీంతో పాటు గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రకటించిన హామీలు అమలు చేయకపోవడంతో, ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే ఈ నెల ఆరున తమ న్యాయబద్ధమైన డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ ఈ నెల ఆరున ఆశా కార్యకర్తలు ఇచ్చిన చలో విజయవాడకు పిలుపు విజయవంతం కావడంతో, అంగన్‌వాడీల ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేయాలని కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా కుతంత్రాలు, కుట్రలను పన్నుతోంది.

చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీలకు గతేడాది జూలై నెలలో వేతనాలు పెంచుతామంటూ గత ప్రభుత్వం జీవోను వెలువరించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అఽధికారం చేపట్టడంతో ఆ జీఓను అమలు చేయలేదు, కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో అంగన్‌వాడీలు ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చినా, పట్టించుకోకపోవడంతో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ ఈ నెల 10న చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వం అహం దెబ్బతినడంతో ఆ ఉద్యమాన్ని అణగదొక్కాలని నిర్ణయించుకుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ఏడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1,726 అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. అందులో 86,296 మంది చిన్నారులు, ప్రీ స్కూల్‌ విద్యార్థులు, 15,743 మంది బాలింతలు, గర్భిణులున్నారు. వీరికి క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందజేయడంతో పాటు, చిన్నారులకు ఆటపాటలతో వినోద పరికరాలతో విద్యా బోధన చేస్తున్నారు. దీంతో పాటు నిమిషం ఖాళీ లేకుండా, యాప్‌లను పూరించడంతోనే సమయం సరిపోతోందని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హాజరు కావాల్సిందే..

అంగన్‌వాడీలందరూ ఆయా మండల కేంద్రాల్లో సోమవారం నిర్వహించబోయే సెక్టార్‌ సమావేశాలకు హాజరు కావాల్సిందేనని ఐసీడీఎస్‌ శాఖ హుకుం జారీ చేసింది. సరైన కారణాలు లేకుండా గైర్హాజరైతే సంజాయిషీ ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు అంగన్‌వాడీ కార్యకర్తలు చెబుతున్నారు. విధిగా ప్రతి అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయాలు తెరచి ఉంచాలని స్పష్టం చేసినట్టు సమాచారం. చలో విజయవాడకు అనుమతి లేనందున ఎట్టి పరిస్థితుల్లోను సిబ్బంది ఆదేశాలు పాటించాల్సిందేనని సీడీపీఓలు, సూపర్‌వైజర్లు పరోక్ష హెచ్చరికలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో జిల్లా స్థాయి అధికారులు చేసేదేమీ లేక, సమావేశాలకు హాజరు కావాలని, తగిన కారణం లేనిదే సెలవు పెట్టకూడదంటూ అంగన్‌వాడీలకు, ఆయాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.

చర్చలకు పిలిచారు కానీ..

అంగన్‌వాడీలు చలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి సీఐటీయూ నేతలను ఆదివారం చర్చలకు అహ్వానించినట్టు తెలిసింది. ప్రభుత్వం నుంచి సోమవారం సాయంకాలం వరకూ కబురు రాకపోవడంతో, సీఐటీయూ ఆదేశాల మేరకు చలో విజయవాడ నిరసన కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించాలని అంగన్‌వాడీలు నిర్ణయించుకున్నారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లోని మహిళా పోలీసుల సహకారంతో అంగన్‌వాడీల కదలికలను తెలుసుకుని, విజయవాడకు వెళ్లకుండా పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలుచోట్ల అంగన్‌వాడీలను గృహ నిర్బంధం కాగా, మరికొందరు అంగన్‌వాడీలు ఇప్పటికే విజయవాడ చేరుకున్నట్టు సమాచారం.

హామీలను నెరవేర్చాలి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీలను పట్టించుకోవడం లేదు. అందుకే రాష్ట్ర నాయకత్వం మహా ధర్నాకు పిలుపునిచ్చింది. ఎన్నికల సమయంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.

– డి.ఆదిలక్ష్మి, అధ్యక్షురాలు,

అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల సంఘం, మండపేట ప్రాజెక్టు, రాయవరం

అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు

అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల డిమాండ్ల సాధనకు విజయవాడలో మహాధర్నాకు సిద్ధమయ్యాం. మహాధర్నాకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదెంత మాత్రం సమంజసం కాదు. బలప్రయోగంతో అడ్డుకునే ప్రయత్నాలు సరికావు.

– కె.కృష్ణవేణి, జిల్లా ప్రధాన కార్యదర్శి,

అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, మండపేట

ప్రధాన డిమాండ్లివే..

అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెర్పర్స్‌ వేతనాలను సత్వరం పెంచాలి.

గ్రాడ్యుటీపై జీవోను వెంటనే విడుదల చేయాలి

మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్‌ కేంద్రాలుగా మార్చాలి.

అంగన్‌వాడీలందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి.

అంగన్‌వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి.

పనిభారం తగ్గించి, యాప్‌లను కుదించాలి.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కనీస వేతన చట్టం అమలు చేయాలి.

గొంతు దాటనినిరసన గళం1
1/5

గొంతు దాటనినిరసన గళం

గొంతు దాటనినిరసన గళం2
2/5

గొంతు దాటనినిరసన గళం

గొంతు దాటనినిరసన గళం3
3/5

గొంతు దాటనినిరసన గళం

గొంతు దాటనినిరసన గళం4
4/5

గొంతు దాటనినిరసన గళం

గొంతు దాటనినిరసన గళం5
5/5

గొంతు దాటనినిరసన గళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement