సుఖీభవకు మంగళం! | - | Sakshi
Sakshi News home page

సుఖీభవకు మంగళం!

Mar 3 2025 12:12 AM | Updated on Mar 3 2025 12:10 AM

ఆలమూరు: రాష్ట్రంలో ఏటా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు, ధరల స్థిరీకరణ నిధులు లేక వరిసాగు క్రమేణా తగ్గుతున్న తరుణంలో ఆదుకోవలసిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకుంటామన్న కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. ఏటా పెరుగుతున్న పెట్టుబడికి తగ్గట్టుగా ధాన్యం ధర పెరగడం లేదు. దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాలు నష్టాలను మిగులుస్తున్నాయి. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అర్హులైన వరి రైతులందరికి రూ.20 వేలు పంట సాయం అందిస్తామన్న కూటమి ప్రభుత్వం హామీ బుట్టదాఖలైంది. ప్రభుత్వం పాలన చేపట్టి తొమ్మిది నెలలు పూర్తయినా అన్నదాత సుఖీభవ పథకం అమలుకు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అలాగే ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ అరకొర నిధుల కేటాయింపుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రంతో కలిసి ప్రతి ఏటా మూడు విడతలుగా రూ.13,500 సాయం అందించేవి. కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా రూ.ఆరు వేలు, రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలుగా రూ.7500 రైతుల బ్యాంకు ఖాతాల్లో క్రమం తప్పకుండా నిర్ణీత సమయానికి పంట సాయం సొమ్ము జమ అయ్యేది. ఇలాంటి తరుణంలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పంటసాయాన్ని రూ.13,500 నుంచి రూ 20 వేలు పెంచుతానని హామీ ఇచ్చింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జూన్‌ 18న తొలివిడతగా రూ రెండు వేలు జమ చేయగా, అక్టోబర్‌ ఐదున రెండో విడతగా మరో రూ.రెండువేలు జమ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న మూడో విడతగా రూ.రెండు వేలు జమ చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ సుఖీభవకు నయపైసా విడుదల చేయలేదు.

అమలు చేసేదెప్పుడు?

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని 22 మండలాల్లో 2025–26 రబీ సీజన్‌కు సంబంధించి 1.89 లక్షల ఎకరాల్లో 1.03 లక్షల రైతులు రబీ సీజన్‌లో వరిసాగు చేపట్టారు. అందులో భాగంగా పీఎం కిసాన్‌ పథకానికి 1.28 లక్షల మంది రైతులు అర్హుత పొంది ఉన్నారు. గత ఏడాది జూన్‌ 18న రూ.రెండు వేలు చొప్పున అర్హులైన రైతులందరికి రూ.24.46 కోట్లు జమ చేసింది. రెండో విడతగా అక్టోబర్‌ 5న రెండో విడతగా మరో రూ.22.45 కోట్లు, ఈ ఏడాది ఫిబ్రవరి 24న మూడవ విడత రూ 24.58 కోట్లు జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూన్‌ 12న ప్రమాణ స్వీకారం చేయడంతో తొలివిడత సాయం జమ చేయకుండా వదిలేసింది. రెండో విడత సాయంపైనా, ఈ ఏడాది మూడో విడతపై కూడా ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు.

ఏటా పెరుగుతున్న పెట్టుబడి

వరి పంటకు మద్దతు ధర అంతగా పెరగకపోయినా పెట్టుబడి మాత్రం ప్రతి సీజన్‌కు పెరిగిపోతోంది. గత వైఎస్సార్‌ సీపీ హయాంలో నిర్ణీత తేదీన పంటసాయాన్ని రైతు ఖాతాలో వేయడంతో పెట్టుబడికి ఉపశమనం లభించేది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఎకరా వరిసాగుకు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకూ ఖర్చు అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయంతో ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడకుండా రైతులు వరిసాగు చేపట్టేవారు. ప్రస్తుతం ప్రభుత్వ అనాలోచిత వైఖరి వల్ల వరి రైతులకు సాగు కష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం మూడు విడతలు పంట సాయం మంజూరు చేయకపోవడంతో జిల్లాలో రైతులు రూ.144.20 కోట్లు కోల్పోయారు. ఈ మూడు విడతల్లో ఒక్కొక్క రైతు సగటున రూ.14 వేలు కోల్పోయినట్ల అయ్యింది.

రైతు భరోసా కేంద్రం

పీఎం కిసాన్‌ మూడో విడత విడుదలైనా

పైసా విదల్చని కూటమి సర్కార్‌

బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు

పెట్టుబడి సాయానికి

అన్నదాత ఎదురుచూపు

వరిసాగు వివరాలు

ఖరీఫ్‌ వరిసాగు (ఎకరాల్లో) 1.89 లక్షలు

వరిసాగు చేసిన రైతులు 1.03 లక్షలు

పీఎం కిసాన్‌ లబ్ధిదారులు 1,28 లక్షలు

జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు 515

మూడు విడతల సాయం ఒకేసారి అందించాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం అఽధికారం చేపట్టి నాటి నుంచి ఇప్పటి వరకూ రైతుల ఖాతాల్లో మూడు విడతల సొమ్ము రూ.20 వేలు జమ చేయాలి.

– అన్యం చంద్రరావు, కౌలురైతు, ఆలమూరు

అధిక వడ్డీలకు అప్పులు

రాష్ట్ర ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌లో ప్రకటించిన విధంగా పంటసాయం అందించకపోవడంతో అఽధిక వడ్డీలకు అప్పులు చేసి వరిసాగు చేస్తున్నాం. దీనివల్ల తీవ్రమైన ఆర్థికభారం పడుతోంది. గత ప్రభుత్వం సీజన్‌కు ముందే రైతుల ఖాతాల్లో పంట జమ చేసేది.

– పిల్లి వెంకన్న, వరిరైతు,

పినపళ్ల, ఆలమూరు మండలం

సుఖీభవకు మంగళం!1
1/4

సుఖీభవకు మంగళం!

సుఖీభవకు మంగళం!2
2/4

సుఖీభవకు మంగళం!

సుఖీభవకు మంగళం!3
3/4

సుఖీభవకు మంగళం!

సుఖీభవకు మంగళం!4
4/4

సుఖీభవకు మంగళం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement