బడ్జెట్‌తో మోసం చేసిన చంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌తో మోసం చేసిన చంద్రబాబు

Mar 1 2025 8:15 AM | Updated on Mar 1 2025 8:39 AM

మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి

రావులపాలెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌తో చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ పథకాలకు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయింపులు చేయలేదన్నారు. మహిళలకు సున్నా వడ్డీకి రుణాలు, ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి బడ్జెట్లో మొండిచేయి చూపారని అన్నారు. నిరుద్యోగులకు భృతి కింద రూ.మూడు వేలు ఇస్తామని ప్రకటించి మాట మార్చారన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామని చెప్పినా, దానికి తగినట్టుగా బడ్జెట్లో కేటాయింపులు లేవన్నారు. దీపం పథకం కింద రాష్ట్రంలో 1,55,000 మంది మహిళలు లబ్ధి పొందే అవకాశం ఉంటే, దానికి రూ.4 వేల కోట్లు అవసరం కాగా కేవలం రూ.2,601 కోట్లు కేటాయించారన్నారు. తల్లికి వందనం పథకానికి నామమాత్రం కేటాయింపులు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ బడ్జెట్‌ ప్రవేశ పెడుతుంటే ఏమీ మాట్లాడకుండా ఉండడం చూస్తుంటే విస్తుపోయేలా చేస్తోందన్నారు. ప్రశ్నించడానికే వచ్చానని, ప్రజల పక్షాన పోరాడతానని మాట్లాడిన పవన్‌ కళ్యాణ్‌ మహిళలకు రూ.1,800 ప్రతి సంవత్సరం ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టించి ఇప్పుడు మోసం చేస్తున్నారని అన్నారు. విద్యుత్‌ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచేశారని గుర్తు చేశారు. అలాగే ప్రజలకు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను గాల్లో కలిపేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ చేతుల్లో ఉందని చెప్పుకునే చంద్రబాబు పన్నుల రూపంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి వంద రూపాయలు కడుతుంటే తిరిగి రాష్ట్రానికి కేవలం 42 రూపాయలు మాత్రమే తీసుకువస్తున్నారని, పక్కన ఉన్న తెలంగాణ 49 రూపాయలు తెచ్చుకుంటున్నారని అన్నారు. కేవలం అసెంబ్లీ అంటే లోకేష్‌కు భజన చేసే సభగా మార్చేశారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని అడగమని మాట్లాడిన లోకేష్‌ చొక్కాను పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు పట్టుకోవటం లేదని ప్రశ్నించారు. మంత్రులందరికీ ర్యాంకులు ఇచ్చిన చంద్రబాబు అవినీతిలో కూడా ర్యాంకులు ఇస్తే మొట్టమొదటి స్థానంలో లోకేష్‌ వస్తాడని, రెండో స్థానంలో కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఉంటాడన్నారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా తొలిసారిగా రావులపాలెం వచ్చిన పిల్లి సూర్యప్రకాష్‌ను మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పూలమాలలు, శాలువాతో సత్కరించారు. అముడా మాజీ చైర్మన్‌ గొల్లపల్లి డేవిడ్‌రాజు, కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధరరావు, రావులపాలెం జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, కప్పల శ్రీధర్‌, మండల కన్వీనర్లు దొమ్మేటి అర్జునరావు, తమ్మన శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement