సమస్యాత్మక ప్రాంతాల్లో క్యాసో | Sakshi
Sakshi News home page

సమస్యాత్మక ప్రాంతాల్లో క్యాసో

Published Sat, May 25 2024 3:35 PM

-

అమలాపురం టౌన్‌: ఓట్ల లెక్కింపు రోజు దగ్గర పడుతున్న క్రమంలో జిల్లా పోలీసులు అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ మద్యం నిల్వలు, అమ్మకాలపై దాడుల స్పీడ్‌ను మరింత పెంచారు. జిల్లా కలెక్టర్‌ సుసరాపు శ్రీధర్‌, ఏఎస్పీ ఎస్‌.ఖాదర్‌బాషాలు శ్రీనివాస ఇంజినీరింగ్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పోలీసు బందోబస్తును శుక్రవారం మరోసారి పర్యవేక్షించారు. జిల్లాలోని సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ (క్యాసో) నిర్వహించారు. ఈ తనిఖీల వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయం శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో వివరించింది.

● స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు, కేంద్ర బలగాల వివరాల రికార్డులను ఎస్పీ శ్రీధర్‌ మరోసారి పరిశీలించి వారికి మరిన్ని సూచనలు ఇచ్చారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద ఏర్పాటుచేసిన 360 డిగ్రీల పరిధిలోని సీసీ కెమెరాల అమరిక, ఫెన్సింగ్‌లను ఎస్పీ తనిఖీ చేశారు.

● కాట్రేనికోన పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బలుసుతిప్ప గ్రామంలో విస్త్రృత దాడులు చేసి ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. అక్రమ మద్యం నిల్వలు, అమ్మకాలు సాగిస్తున్న అతని వద్ద నుంచి 326 నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మద్యం సీసాలను సీజ్‌ చేశారు. అమలాపురం డీఎస్పీ ఎం.మహేశ్వరరావు ఆదేశాలతో ముమ్మిడివరం సీఐ ఎన్‌.కొండయ్య పర్యవేక్షణలో కాట్రేనికోన ఎస్సై ఎస్‌.నాగేశ్వరావు ఈ దాడులు చేశారు.

● మలికిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శంకరగుప్తం గ్రామంలో పోలీసు అధికారులు క్యాసో తనిఖీలు చేశారు. రికార్డులు లేని తొమ్మిది మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ ఆదేశాలతో రాజోలు సీఐ ఆర్‌.గోవిందరాజు పర్యవేక్షణలో మలికిపురం ఎస్సై సంపత్‌కుమార్‌ ఈ దాడులు నిర్వహించారు.

● మండపేట రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని వేములపల్లి గ్రామంలో క్యాసో తనిఖీలు నిర్వహించారు. రికార్డులు లేని రెండు మోటారు సైకిళ్లను సీజ్‌ చేశారు.

● ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తమ ప్రాంతాల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి బందోబస్తుపై అవగాహన కల్పించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement