Sakshi News home page

14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

Published Sat, Nov 11 2023 2:42 AM

గ్రంథాలయంలో చదువుతున్న పాఠకులు - Sakshi

రాయవరం: గ్రంథాలయాలపై అవగాహన కల్పించడం, పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ నెల 14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గ్రంథాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు పది విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాలయాలకు వెళ్లి అవగాహన కల్పించనున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 101 గ్రంథాలయాలున్నాయి. కాకినాడలోని జిల్లా గ్రంథాలయంతో పాటుగా గ్రేడ్‌–1 గ్రంథాలయాలు 6, గ్రేడ్‌–2 లైబ్రరీలు 10, గ్రేడ్‌–3 (శాఖా గ్రంథాలయాలు) 85 ఉన్నాయి. వీటిల్లో పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని పుస్తకాలూ అందుబాటులో ఉంచుతున్నారు. ఇవి చదువుకుంటూనే చాలా మంది గ్రూప్‌–1, గ్రూపు–2, సివిల్స్‌ వంటి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతున్నారు. ‘రీడర్‌ ఆన్‌ డిమాండ్‌’ పేరుతో కూడా పుస్తకాలు అందిస్తున్నారు. గ్రంథాలయాలను డిజిటలైజ్‌ చేస్తున్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వీటన్నింటిలోనూ పోటీలు, ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులను జూనియర్‌, సీనియర్లుగా విభజిస్తారు. వీరికి వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం, కథలు, ఆటలు, క్విజ్‌, పాటలు, డ్యాన్సులు, కంప్యూటర్‌, పుస్తక పఠనం తదితర పోటీలు నిర్వహిస్తారు. ఎటువంటి ముందస్తు నమోదూ లేకుండానే నేరుగా పోటీలకు హాజరు కావచ్చు. గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందిస్తారు. గత వేసవిలో నిర్వహించిన శిక్షణ శిబిరాలు, ప్రస్తుత గ్రంథాలయ వారోత్సవాలకు కలిపి ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది.

ఫ ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ

ఫ విద్యార్థులకు వివిధ పోటీలు

అవగాహన కల్పిస్తున్నాం

గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్ర స్థాయికి పంపిస్తాం.

– వీఎల్‌ఎన్‌వీ ప్రసాద్‌,

సెక్రటరీ, జిల్లా గ్రంథాలయ సంస్థ, కాకినాడ

వారోత్సవాలు నిర్వహిస్తారిలా..

తేదీ కార్యక్రమం

14 వారోత్సవాలు ప్రారంభం, ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ

15 పుస్తక ప్రదర్శన, పఠనం, మత్తు పదార్థాల నివారణపై అవగాహన

16 గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేసిన వారి చరిత్రలును తెలియజేయడం

17 కవి సమ్మేళనం, రచయతల పరిచయం

18 చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్‌, ఇండోర్‌ క్రీడలు

19 దిశ యాప్‌ వినియోగం, మహిళాభివృద్ధిపై అవగాహన సదస్సులు

20 డిజిటల్‌ గ్రంథాలయాలు, నచ్చిన పుస్తకం చదవడం, ముగింపు కార్యక్రమం

Advertisement
Advertisement