పాత్రికేయుడి ముసుగులో దందా  | Youtube Channel Journalist Fraud In Kurnool District | Sakshi
Sakshi News home page

పాత్రికేయుడి ముసుగులో దందా 

Sep 5 2020 8:46 AM | Updated on Sep 5 2020 8:46 AM

Youtube Channel Journalist Fraud In Kurnool District - Sakshi

హుసేన్‌బాషా  

ఓ యుట్యూబ్‌ చానెల్‌ పాత్రికేయుడు నయా దందాకు తెరలేపాడు. నిరుద్యోగ యువతీ, యువకులను ఉద్యోగాల పేరుతో నమ్మించి తన దారిలోకి తెచ్చుకొని ఆ తర్వాత వారితోనే ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నాడు. పాత రేడియోల్లోని రెడ్‌ మెర్క్యూరీ ద్రావణం కొనుగోలు చేస్తామంటూ ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలు చూపించి అమాయకులను మోసంచేస్తున్నాడు. పాత్రికేయుడి చేతిలో మోసపోయిన ఓ బాధితుడు శుక్రవారం త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయంవెలుగులోకి వచ్చింది.

సాక్షి, బొమ్మలసత్రం: నంద్యాల పట్టణానికి చెందిన హుసేన్‌బాషా ఓ యుట్యూబ్‌ చానెల్‌లో పాత్రికేయుడిగా పనిచేస్తున్నాడు. తనకు అధికారులు బాగా పరిచయమని నమ్మించి నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో గాలం వేసి, కొంత డబ్బు తీసుకునేవాడు. ఆ తర్వాత తను చె  ప్పినట్లు చేయాలని లేకపోతే ఉద్యోగం, డబ్బు రెండు రావని బెదిరించేవాడు. అందులో భాగంగానే నంద్యాలకు చెందిన భార్య, భర్త సుజాత, నవీన్‌లకు ఫారెస్ట్‌ ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.50వేలు వసూలు చేశాడు. అనంతరం సుజాతతో మరో ఆన్‌లైన్‌ మోసాలకు శ్రీకారం చుట్టాడు. పరిచయం లేని వ్యక్తులకు ఆమెతో ఫోన్‌ చేయించేవాడు. అలా నంద్యాల మండలం వెంకటేశ్వరపురం గ్రామానికి చెందిన మహేష్‌కు కాల్‌ చేసింది. మీ ఫోన్‌ హ్యాంగ్‌ అవుతుందా.. అంటూ మాటలు కలిపింది. తర్వాత మీ ఇంట్లో పాత రేడియో ఉంటే అందులోని ఎరుపు మెర్క్యూరీ ద్రావణం కొనుగోలు చేస్తామని, రూ.లక్షల్లో నగదు ఇస్తామని ఆశ చూపింది.

నిజమని నమ్మిన మహేష్‌ తన స్నేహితురాలు ఝాన్సీతో కలిసి పాత రేడియోల కోసం ఓఎల్‌ఎక్స్‌లో ఆరా తీశారు. అప్పటికే పాత రేడియోలు తమ వద్ద ఉన్నాయంటూ పాత్రికేయుడు హుసేన్‌ ఓఎల్‌ఎక్స్‌ ప్రకటన ఉంచాడు. సదరు బాధితులు అందులో ఉన్న ఫోన్‌ నెంబరుకు కాల్‌ చేయగా సుజాతనే లిఫ్ట్‌ చేసింది. తమ వద్ద ఉన్న పాత రేడియోలో ఉన్న మెర్క్యూరీ ద్రావణం కావాలంటే రూ.30లక్షలు చెల్లించాలని చెప్పింది. అయితే ముందుగా రేడియోలో ఉన్న ద్రావణాన్ని చూపాలని కోరగా త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఎస్పీజీ స్కూల్‌ గ్రౌండ్‌లోకి రావాలని చెప్పింది. బాధితులు సుజాత వద్దకు చేరుకోగానే హుసేన్‌బాషా కెమెరాతో వారి వద్దకు చేరుకున్నాడు. మెర్క్యూరీ ద్రావణం అణుబాంబులో వాడేదని, ఇంతటి ప్రమాదకరమైన ద్రావణం మీకు ఎందుకని ప్రశ్నల వర్షం కురిపించాడు.

పాత్రికేయుడి మాటలకు బెదిరిపోయిన బాధితులు తమను మీడియాలో చూపొద్దంటూ వేడుకున్నారు. రూ.లక్షలు ముట్టజెబితే వదిలేస్తానని పాత్రికేయుడు చెప్పడంతో వారి వద్ద రూ.76వేలు చేతిలో పెట్టి తమను ఇంతటితో వదిలేయాలని వేడుకున్నారు. అప్పటికి వదిలేసిన నిందితుడు తరచూ ఫోన్‌ చేసి మీడియాలో ప్రసారం చేస్తానని బెదిరిస్తుండటంతో విసుగు చెంది త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పాత్రికేయుడు హుసేన్‌బాషాను, సుజాతను పోలీసులు విచారిస్తున్నారు. గతంలో రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని పాణ్యం మండలానికి చెందిన ఓ మహిళ నుంచి కూడా రూ.50 వేలు వసూలు చేసినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement