పాపం మూగజీవులకు విషం పెట్టి.. గోనెసంచుల్లో కుక్కి.. ఆపై

Miscreants Assassinate 30 Monkeys In Karnataka Hassan District - Sakshi

బెంగళూరు: రోజురోజుకూ మానవత్వం మంట కలసిపోతోంది. కొందరు మానవత్వాన్ని మరిచి మూగ జీవుల ప్రాణాలను తీస్తూ పాపం మూటగట్టుకుంటున్నారు. తాజాగా కోతుల‌కు విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో 30 కోతులు మరణించాయి. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలోని హసన్‌ జిల్లా బెలూర్ స‌మీపం చౌడనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాలు..గురువారం ఉదయం స్ధానిక యువకులు రోడ్డు పక్కన గోనెసంచుల మూటలను గుర్తించారు. వెంటనే వాటిని తెరవగా అందులో  కోతులు కనిపించాయి. అయితే అప్పటికే కొన్ని మృత్యవాత పడగా, మరికొన్ని తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నాయి. సంచుల‌లో ఉన్న వానరాల్లో 30 కోతులు చనిపోగా.. మరో 20 తీవ్రంగా గాయపడ్డాయి.

స్థానికులు గాయపడిన కోతులను బయటకు తీసి నీళ్లు తాగించ‌డంతో 20 కోతుల్లో 18 కోలుకొని ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోయాయి. ఘ‌ట‌న‌పై సమాచారమందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కోతులను వేరే చోటుకు రవాణా చేసే క్రమంలో వారి ప్రణాళికలు విఫలమైనందున ఈ ఘాతుకానికి పాల్పడినట్లు  అధికారులు అనుమానిస్తున్నారు. మరణించిన కోతుల‌కు పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్టులో విషం ఆనవాళ్లు ఉన్నట్లు తేలిన‌ట్లు ఆధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రముఖ నటుడు రణ్‌దీప్‌ హుడా ట్విటర్‌లో షేర్‌ చేస్తూ విచారణ వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top