జంట పేలుళ్ల కేసులో నజీర్, షఫాస్‌ నిర్దోషులు

Kerala High Court acquits Thadiyantevida Nazeer, Shafas case - Sakshi

కొచ్చి: కోజికోడ్‌ జంట పేలుళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కార్యకర్త తడియంతెవిడ నజీర్, షఫాస్‌లను నిర్దోషులుగా పేర్కొంటూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది.  కోజికోడ్‌ కేఎస్‌ఆర్‌టీసీ, మొఫుసిల్‌ బస్టాండ్‌లలో జరిగిన బాంబు పేలుళ్లకు నజీర్, ఇతర నిందితులు కుట్ర చేశారని, ప్రణాళికతో పాటు అమలు చేసినట్లు వీరిపై అభియోగాలున్నాయి.  2011లో ఎన్‌ఐఏ కోర్టు వీరిని దోషులుగా తేల్చింది.

నజీర్, షఫాస్‌ ఇద్దరూ చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, 1967(ఉపా)లోని వివిధ సెక్షన్ల కింద నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించి ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు విధించిన జీవిత ఖైదును సవాలు చేస్తూ మొదటి నిందితుడు నజీర్, నాలుగో నిందితుడు షఫాస్‌ దాఖలు చేసిన అప్పీలును కేరళ  హైకోర్టు అనుమతించింది. న్యాయమూర్తులు కె.వినోద్‌ చంద్రన్, జియాద్‌ రెహమాన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ గురువారం తుదితీర్పు వెల్లడించింది.

ఘట న జరిగిన నాలుగు సంవత్సరాల తరువాత ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకున్న ఈ కేసు దర్యాప్తు సంక్లిష్టతను తాము అర్థం చేసుకున్నామని చెప్పిన ధర్మాసనం వారే నేరం చేశారనేందుకు నమ్మదగిన ఆధారాలేవీ లేవని పేర్కొన్నది. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎన్‌ఐఏ దాఖలు చేసిన అప్పీలును కూడా ధర్మాసనం తిరస్కరించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top