Hyderabad: దొంగలు బాబోయ్‌ దొంగలు.. ఆరేళ్లలో ఏకంగా రూ.4,611 కోట్లు హాంఫట్‌

Hyderabad: Fraudsters Hit Rs 4611 Crore In Last 6 Years - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రోజుకు రూ.2,13,49,092.. నెలకు రూ.64,04,72,775.. ఏడాదికి రూ.768,56,73,302.. ఆరేళ్లల్లో రూ.4611,40,39,817.. నగరంలో మోసగాళ్లు కొట్టేసిన మొత్తమిది. 2015–2020 మధ్య ఆరేళ్ల కాలంలో 9,101 మోసాల కేసుల్లో హైదరాబాద్‌ వాసులు కోల్పోయింది  అక్షరాలా రూ.4611,40,39,817. ఈ ఏడాది ఆగస్టు వరకు మరో 1,111 కేసులు నమోదయ్యాయి. వీటిలో పోయింది ఎంతనేది మాత్రం ఏడాది చివరలోనే తేలనుంది.

ఆశ, నమ్మకాలే పెట్టుబడి... 
మోసగాళ్లు ఎదుటి వారిలో ఉన్న ఆశ, వారి నమ్మకాలనే పెట్టుబడిగా పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారు. వీరికి చట్టంలోని లొసుగులు కూడా కలిసి వస్తున్నాయి. వైట్‌కాలర్‌ నేరాల్లో సైబర్‌ క్రైమ్‌ కూడా ఒకటి. సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు చిక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎవరికి ఫిర్యాదు చేయాలన్నది సామాన్యులకు స్పష్టంగా తెలియక, స్థానిక పోలీసుల నుంచి సరైన స్పందన లేక అనేక కేసులు నమోదు కావట్లేదు.
చదవండి: సెప్టిక్‌ ట్యాంకులు, మ్యాన్‌హోళ్లు.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?

నమోదైనా అవసరమైన స్థాయిలో దర్యాప్తు ఉండదు. సైబర్‌ నేరగాళ్లు తీసుకుంటున్నా జాగ్రత్తలకు తోడు ఈ నేరాల దర్యాప్తులో అన్ని విభాగాల పోలీసులకు పట్టు ఉండట్లేదు. ఫలితంగా ఇంటర్నెట్‌ కేంద్రంగా చోటు చేసుకుంటున్న సైబర్‌ నేరాల్లో 50 శాతం కూడా నమోదు కావట్లేదు. నమోదైన మోసాల్లో సగం కూడా కొలిక్కి రావట్లేదు. వీరి నుంచి నగదు రికవరీ అనేది దుర్లభం. మోసాలు చేసే నేరగాళ్లు చిక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నా శిక్షలు పడటం అరుదుగా మారింది.
చదవండి: సిటీకి కొత్త.. నమ్మి ఆటో ఎక్కితే ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లి..

చక్కదిద్దే చర్యలు.. 
ఈ పరిస్థితుల్ని బేరీజు వేసిన పోలీసు విభాగం కొన్ని చక్కదిద్దే చర్యల్ని ప్రారంభించింది. ఇటీవల కాలంలో సైబర్‌నేరగాళ్లు నానాటికీ పేట్రేగుతుండటం, ఆర్థిక నేరాల వల్లే ప్రజలు ఎక్కువ నష్టం పోవడాన్ని పరిగణలోకి తీసుకుని అనేక చర్యలకు ఉపక్రమించారు. ప్రాథమికంగా అధికారులకు దర్యాప్తు తీరుతెన్నుల్లో మెళకువలు నేర్పిస్తున్నారు. సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) అధికారులకు అనుభవజ్ఞులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. సైబర్, ఎకనమిక్‌ నేరాల దర్యాప్తుపై తర్ఫీదు ఇవ్వడంతో పాటు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నారు. తీవ్రమైన నేరాల్లో ఆదాయపుపన్ను శాఖతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు సమాచారం ఇస్తున్నారు. ఆయా కేసులను పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఈ విభాగాలూ దర్యాప్తు చేపడుతున్నాయి. 

కఠిన చట్టం అవసరం
మోసగాళ్లను కట్టడి చేయడానికి మరిన్ని కఠిన చట్టాలు అవసరం. ప్రస్తుతం కేవలం డిపాజిటర్స్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌తో నమోదైన కేసులతో పాటు మనీ లాండరింగ్‌ చట్టం కింద కేసుల్లో మాత్రమే నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రతి ఆర్థిక నేరంలోనూ ఈ విధానం అమలయ్యేలా మార్పులు రావాలి. వైట్‌ కాలర్‌ నేరగాళ్ల పైనా నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది.  
– శ్రీనివాస్, మాజీ డీఎస్పీ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top