ప్రియురాల్ని హత్య చేసి.. ఆమె శరీర భాగాల్ని ఫ్రిజ్‌లో దాచేసి | Horrible Incident at Vizag, Check Full Details | Sakshi
Sakshi News home page

విశాఖలో దారుణం.. ప్రియురాల్ని హత్య చేసి.. ఆమె శరీర భాగాల్ని ఫ్రిజ్‌లో దాచేసి

Mar 30 2026 7:07 AM | Updated on Mar 30 2026 1:37 PM

Horrible Incident at Vizag, Check Full Details

విశాఖ: ప్రశాంతమైన విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. డబ్బు కోసం నిత్యం వేధింపులకు గురిచేస్తుండడంతో విసిగి, తన ప్రియురాల్ని హత్య చేశాడు. ఆపై ఆమె శరీర భాగాల్ని ఫ్రిజ్‌లో దాచేశాడు నిందితుడు చింతాడ రవీంద్ర (35). ప్రస్తుతం ఈ ఘటన విశాఖలో కలకలం రేపుతోంది.

పోలీసుల వివరాల మేరకు..విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర(35) విశాఖలోని ఎల్‌.వి.నగర్‌లో నివాసం ఉంటున్నాడు. నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. రవీంద్ర భార్య నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో తన స్నేహితురాలు మౌనిక(29)ను ఇంటికి పిలిపించుకున్న రవీంద్ర ఆమెను దారుణంగా హతమార్చాడు. మౌనికను హత్య చేశాననే విషయాన్ని రవీంద్ర తన స్నేహితుడికి చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రవీంద్ర స్నేహితుడి ఫిర్యాదుతో మౌనిక హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.  ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

నేవీలో పనిచేస్తున్న రవీంద్రకు గతంలో ఓ డేటింగ్ యాప్ ద్వారా మౌనిక పరిచయమైంది. పరిచయం ప్రేమగా మారి, మూడేళ్ల పాటు ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. ఇదే సమయంలో రవీంద్ర పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. వివాహం అనంతరం మౌనికను దూరం పెట్టడంతో, ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి.

ఈ క్రమంలో రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో మౌనికను ఇంటికి పిలిచాడు. అక్కడే ఆమెను హత్య చేసి, శరీరాన్ని మూడు భాగాలుగా విభజించాడు. కొన్ని భాగాలను ఇంట్లోని ఫ్రిజ్‌లో ఉంచి, మరికొన్ని భాగాలను అడవివరం సమీపంలో కాల్చేశాడు. హత్య అనంతరం భయాందోళనకు గురైన రవీంద్ర తన స్నేహితుడికి ఈ విషయం చెప్పాడు. అతడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు వెలుగులోకి వచ్చింది.

దర్యాప్తులో హత్యకు ముందు రవీంద్ర–మౌనిక మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మౌనిక తన నుంచి డబ్బులు డిమాండ్ చేసిందని, ఇప్పటికే రూ. 3.5 లక్షలు తీసుకున్నదని, ఐడి కార్డు విషయంలో ఇబ్బంది పెట్టిందని రవీంద్ర పోలీసులకు తెలిపాడు. డబ్బుల సమస్యలతో విసిగి హత్య చేశానని ఒప్పుకున్నాడు. పథకం ప్రకారమే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

ముందుగానే కత్తులు కొనుగోలు చేసి, మౌనికను హత్య చేసినట్లు రవీంద్ర విచారణలో వెల్లడించాడు. మౌనిక గతంలో బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో, అనంతరం ఎంవీపీలోని ప్రైవేట్ బ్యాంక్‌లో పనిచేసినట్లు సమాచారం. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
 
నా కుమార్తెకు ఎలాంటి చావు తెచ్చాడో.. 
బాధితురాలు మౌనిక హత్యపై ఆమె తండ్రి గోపాలరావు మీడియాతో మాట్లాడారు. నా కుమార్తెను అన్యాయంగా చంపేశారు. నిందితుడు రవీంద్ర ప్రేమ పేరుతో నా కుమార్తెను ట్రాప్‌ చేశాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు నా కుమార్తె డబ్బులు డిమాండ్‌ చేసిందని అంటున్నారు. డబ్బులు డిమాండ్‌ చేసే అవసరం నా కుమార్తెకు లేదు. ఆమె పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఉద్యోగం చేసేది.  నా కుమార్తెకు ఎలాంటి చావు తెచ్చాడో.. అలాంటి చావే అతడికీ రావాలి’ అని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement