సైబర్‌ బొంకు..బూస్టర్‌ డోస్‌ పేరుతో నేరగాళ్ల నయా పన్నాగం

Cyber Criminal Scams In The Name Of Booster Dose - Sakshi

సాక్షి హైదరాబాద్‌:  సైబర్‌ నేరగాళ్లు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. కరోనా, ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో బూస్టర్‌ డోస్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమతుంటే.. దీనిని సాకుగా తీసుకుని సైబర్‌ నేరస్తులు సరికొత్త మోసాలకు సిద్ధమవుతున్నారు. వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటూ నకిలీ లింక్‌లు పంపిస్తున్నారు. ఇది నిజమేనని నమ్మి నేరస్తుల వలలో చిక్కి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సైబర్‌ నేరగాళ్లు తాజాగా బూస్టర్‌ డోస్, ఉచిత ఒమిక్రాన్‌ పరీక్షల పేరిట మోసాలకు సిద్ధమవుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఫలానా రోజున, ఫలానా ప్రాంతంలో బూస్టర్‌ డోస్‌ కోసం ఏర్పాటు చేస్తున్నామని, ఆసక్తి ఉన్న వాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలని మెసేజ్, వాట్సాప్, ఈ–మెయిల్స్‌ పంపిస్తూ అమాయకులకు వల వేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలలో పలు కేసులు నమోదయ్యాయని ఓ పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు. నగర ప్రజలూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.   

ఓటీపీతో హ్యాంకింగ్‌.. 

  • బూస్టర్‌ డోస్‌ ప్రచారాన్ని ప్రజలను నమ్మించేందుకు సైబర్‌ నేరగాళ్లు కాల్‌ స్పూఫింగ్‌ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. మెడికల్, ఇతరత్రా ప్రభుత్వ విభాగాల నంబర్లను డిస్‌ప్లే అయ్యేలా స్పూఫింగ్‌ చేయడంతో మోసగాళ్లు ఫోన్‌ చేసినా సరే బాధితుల ఫోన్‌లో ‘వ్యాక్సిన్‌ డిపార్ట్‌మెంట్‌’ అని సెల్‌ఫోన్‌లో కనిపిస్తుంటుంది. దీంతో అటువైపు నుంచి బాధితులు కూడా సులువుగా నమ్మేస్తారు. టీకా కోసం షెడ్యూల్డ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని నకిలీ ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారు. మెసేజ్, వాట్సాప్, ఈ– మెయిల్స్‌కు నకిలీ లింక్‌లు పంపిస్తున్నారని తెలిసింది.  
  • తమ పేర్ల నమోదు నిర్ధారణ కోసం సెల్‌ఫోన్‌కు వచ్చిన వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) తెలపాలని కోరుతున్నారు. ఓటీపీ తెలపగానే.. బాధితుల సె ల్‌ఫోన్‌ లేదా కంప్యూటర్‌కు హానికరమైన సాఫ్ట్‌వేర్‌లను పంపిస్తారు. దీంతో బాధితుడి ఎలక్ట్రానిక్‌ ఉపకరణం హ్యాక్‌ అయిపోతుంది. ఆపైన సెల్‌ఫో న్‌లోని క్రెడిట్, డెబిట్‌ కార్డ్, యూపీఐ, ఆధార్, పాన్‌ కార్డ్‌ నంబర్లు, ఈ– మెయిల్‌ ఐడీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తారు. వాటి సహాయంతో మోసాలకు పాల్పడే ప్రమాదముంది.  

56 కేసులు నమోదు.. 

  • కరోనా ప్రారంభ దశలో సైబర్‌ నేరస్తులు కోవిడ్‌ మందులు, పల్స్‌ ఆక్సిమీటర్లు, ఆక్సిజన్‌ సిలిండర్ల, కాన్సట్రేటర్లు, రోగ నిరోధక శక్తిని పెంచే సాధనాలు వంటివి సరఫరా చేస్తామనే మాయమాటలతో ప్రజలను నమ్మించి దోచుకున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో గతేడాది కరోనా మందుల బ్లాక్‌ మార్కెట్‌పై 56 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు బూస్టర్‌ డోస్‌ ఇస్తామని వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సామాజిక మాధ్యమాలలో ప్రచారాలను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.  
  • కోవిడ్‌ బూస్టర్‌ డోస్‌ అంటూ వచ్చే ఫోన్‌ కాల్స్, సందేశాలు, ఈ–మెయిల్స్‌ వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఏ ప్రభుత్వ సంస్థలు, బ్యాంక్‌లు కూడా ఓటీపీ అడగవనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. 

ఓటీపీ అడిగితే మోసమే 
బూస్టర్‌ డోస్‌ తీసుకుంటే సురక్షితమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో డోస్‌ ఇప్పిస్తామని నకిలీ మెసేజ్, ఫోన్లు, లింక్‌లు పంపించి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. ఎవరైనా క్రెడిట్, డెబిట్‌ కార్డ్‌ వివరాలు, యూపీఐ, ఓటీపీ అడిగారంటే మోసమేనని గుర్తించాలి. 
– డాక్టర్‌ లావణ్య, డీసీపీ, సైబర్‌ క్రైమ్, సైబరాబాద్‌  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top