పేకాటరాయుళ్ల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

పేకాటరాయుళ్ల అరెస్ట్‌

Apr 15 2026 7:44 AM | Updated on Apr 15 2026 7:44 AM

పలమనేరు: మండలంలోని కొలమాసనపల్లి అటవీ ప్రాంతంలో రహస్యంగా పేకాట ఆడు తున్న వారిపై పలమనేరు పోలీసులు మంగళవారం దాడులు చేశారు. ఆ మేరకు ఐదుగురిని పట్టుకోగా వారి నుంచి రూ.50 వేలు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ లోకే ష్‌రెడ్డి తెలిపారు. ఇందులో మొత్తం ఎనిమిది మంది ఉండగా ఐదుగురు దొరికారని, మిగిలిన వారిని త్వరలో పట్టుకుంటామని ఆయన తెరలిపారు.

టీటీడీకి రూ.27 లక్షల విరాళం

తిరుమల: కర్ణాటక రాష్ట్రం బెళగావికి చెందిన ప్రవీణ్‌ సోన్వాల్కర్‌ మంగళవారం టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షలు విరాళంగా అందించారు. అదేవిధంగా సుభాష్‌ సోన్వాల్కర్‌ అనే భక్తుడు కూడా శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని టీటీడీ చైర్మన్‌ క్యాంపు కార్యాలయంలో చైర్మన్‌ బీఆర్‌ నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.

గ్రామ సమస్యలకు ప్రాధాన్యత

చిత్తూరు కార్పొరేషన్‌: గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తామని ప్రత్యేకాధికారులు తెలిపారు. జిల్లాలోని పంచాయతీల్లో అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా గ్రామసభలను నిర్వహించారు. మొత్తం 621 పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా గ్రామాల్లోని సమస్యలపై చర్చించారు. బుధవారం జిల్లాలో పంచాయతీలకు సంబంధించి ఓటర్ల ముసాయిదా జాబితాను పంచాయతీ అధికారులు ప్రకటించనున్నారు. ఈ మేరకు సంబంధిత పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో వివరాలను నోటీసుబోర్డులో పెట్టనున్నట్లు డీపీఓ సుధాకర్‌రావు వివరించారు.

సీఐ ఆకస్మిక దాడులు

పూతలపట్టు(యాదమరి): బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై పూతలపట్టు సీఐ గోపి దాడులకు ఉపక్రమించారు. ప్రజల శాంతి భద్రతలే తన ప్రథమ కర్తవ్యమని మరోసారి నిరూపించారు. మంగళవారం మండలంలోని పలు ప్రాంతాల్లో సీఐ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో బహిరంగంగా మద్యం సేవిస్తూ నిషాతో ఉన్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారందరికీ బ్రీత్‌ అనలైజర్‌ ద్వారా పరీక్షలు నిర్వహించారు. పరీక్షలలో వారు మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో వారి వివరాలు నమోదు చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

బైక్‌ను ఢీకొన్న కారు

నాగలాపురం: ద్విచక్ర వాహనాన్ని, కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు గాయాలైన ఘటన మండలంలోని అక్షర జూనియర్‌ కళాశాల వద్ద మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నాగలాపురం మండలం రజానగరం గ్రామానికి చెందిన జయరత్నం(58), శరవణ(45) అనే ఇదరు వ్యక్తులు ద్విచక్ర వాహనంలో సొంత పనుల నిమిత్తం ఊత్తుకోటై వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో అక్షర జూనియర్‌ కళాశాల సమీపంలో తిరుపతి వైపు వెళ్తున్న ఓ కారు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 అంబులెన్సుకు సమాచారం అందించడంతో ప్రథమ చికిత్స నిమిత్తం నాగలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నగరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

తిరుపతి రూరల్‌: తిరుపతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓటేరు గ్రామ పంచాయతీ వద్ద దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓటేరు చెరువుకు పడమర వైపున ఉన్న ముళ్ల పొదల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం మంగళవారం బయటపడింది. సుమారు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళ వారం నుంచి పది రోజుల క్రితం మృతి చెందినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు బయటకు కనిపించే స్థితిలో ఉండడంతో గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. స్థానిక వీఆర్‌ఓ సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement