● స్వర్ణముఖి నదీ తీరంలో మిన్నంటిన రోదనలు ● కన్నీటి పర్యంతమైన స్థానికులు ● ఘటనా స్థలిని పరిశీలించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ● మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ● ప్రమాద కారణాలను అన్వేషించాలని డిమాండ్
‘‘దేవుడా మేమేం పాపం చేశాం.. ఎందుకీ కడుపు కోత.. మా బిడ్డలను ఎందుకు దూరం చేశావు.. చిన్న వయసులోనే ఎందుకు తీసుకెళ్లిపోయావు.. ప్రాణ సమానంగా పెంచుకుంది ఇందుకేనా..? పిల్లల ఉసురు తీసి మాకు ఇంతటి శిక్షను విధిస్తావా..? మా ఆశలను నిలువునా ముంచేస్తావా..? ఇక మేం ఎవరిని చూసుకుని బతకాలి’’ అంటూ వేదాంతపురంలో స్వర్ణముఖి నదిలో మునిగి మృత్యువాత పడిన నలుగురు బాలుర తల్లిదండ్రులు హృదయవిదారకంగా రోదించారు. విగతజీవులుగా మారిన బిడ్డలను చూసి గుండెలవిసేలా ఆక్రందించారు. బాధితుల ఆర్తనాదాలు చూసి స్థానికులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు.
తిరుపతి రూరల్ : మండలంలోని వేదాంతపురం సమీపంలోని స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లిన ఏడుగురిలో నలుగురు బాలురు గల్లంతు కావడం విధితమే. శుక్రవారం రాత్రి 10గంటల వరకు చేపట్టిన గాలింపు చర్యల్లో ఒక మృత దేహం (బాలు) మాత్రమే లభించింది. మిగిలిన వారి కోసం శనివారం ఉదయం 6గంటల నుంచే నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితో పాటు డ్రోన్ కెమెరాల సాయంతో నదిని జల్లెడ పట్టారు. 7గంటలకు ప్రకాష్ అనే బాలుడి మృత దేహాన్ని పోలీసులు ఒడ్డుకు చేర్చారు. మధ్యాహ్నం 12గంటల తేజ అనే బాలుడి మృత దేహం లభించింది. తర్వాత వర్షం మొదలవడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. వాన తగ్గిన తర్వాత మళ్లీ గాలించగా సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో మునిచంద్ర మృత దేహం చిక్కింది. వెంటనే మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఒక్కరు కూడా ప్రాణాలతో లేరనే విషయం తెలుసుకున్న కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.
మృతదేహాలను వెలికితీతీకు అవస్థలు
స్వర్ణముఖి నదిలో వరదనీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండడం, అప్పుడప్పుడూ వర్షం కురుస్తుండడంతో శనివారం ఉదయం నుంచి గాలింపు చర్యలకు పలు మార్లు అంతరాయం కలిగింది. ఎస్పీ సుబ్బరాయుడు శనివారం ఉదయం నుంచి అక్కడే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. అదనపు ఎస్పీ రవిమనోహరాచారి ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో కలసి నదిలోకి వెళ్లారు. చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్, తిరుచానూరు, తిరుపతి రూల్, చంద్రగిరి, భాకరాపేట సీఐలు గాలింపు చర్యల్లో పాల్గొన్నా రు. మృత దేహాలను వెలికి తీసేందుకు కృషి చేశారు. ఎట్టకేలకు తమ బిడ్డల చివరి చూపు దక్కేలా చేసినందుకు తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.


