గోడ కూలి మున్సిపల్ కూలీ మృతి
కుప్పం: గోడ కూలి మున్సిపల్ కూలీ మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వివరాలు.. శనివారం ఉదయం ఆర్టిసీ బస్టాండు ఎదురుగా ఉన్న మున్సిపల్ మురుగునీటి కాలువను శుభ్రం చేసేందుకు నలుగురు కూలీలు దిగారు. ఆ సమయంలో కాలువ ఓ వైపు ఉన్న గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. అక్కడ పనిచేస్తున్న కూలీ ఆళ్లగడ్డకు చెందిన శీనయ్య(45) మృతిచెందారు. మరో ముగ్గురు కూలీలు హజరతయ్య, సురేష్, వెంకటేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
మృతుని కుటుంబానికి
రూ.5 లక్షల ఆర్థిక సాయం
పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ గోడ కూలి మృతి చెందిన శివయ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కడా పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. గాయపడిన వారిని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణమా?
కుప్పం ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న మురుగు నీటి కాలువలువ పక్కనున్న గోడలు పాచిపట్టి, పెచ్చులూడి శిథిలావస్థకు చేరాయి. ఇరవై ఏళ్లుగా నీటి ప్రవాహంతో దెబ్బతిని కూలే స్థితికి చేరాయి. కానీ అధికారులు మురుగు నీటి కాలువను శుభ్రం చేయాలని పారిశుద్ధ్య కార్మికులపై ఒత్తిడి చేయడంతోనే కార్మికులు ఆ కాలువలోకి దిగి ప్రాణాల మీదికి తెచ్చుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. కార్మికుల కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నారు.


