అసోసియేషన్ అంటే ప్రశ్నించే గొంతుక
చిత్తూరు కలెక్టరేట్ : అసోసియేషన్ అంటే ప్రశ్నించే గొంతుకగా ఉండాలని ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఎన్‌జీఓ సంఘంలో ఆత్మీయ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు దాదాపు 31 వేల కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ లేకపోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం పై ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. ఆ ఆశలను నిరాశపరచకూడదని చెప్పారు. ఇటీవల జారీచేసిన డీఏ ఉత్తర్వుల్లో తీవ్ర గందరగోళం సృష్టించారన్నారు. దాన్ని సరిచేయాలని తమ సంఘమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందన్నారు. అనంతరం సవరించిన జీవోను జారీచేశారన్నారు.
చేసింది గోరంతే, చేయాల్సింది కొండత
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌లకు చేసింది గోరంతేనని, చేయాల్సింది కొండత ఉందని రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల హెల్త్‌కార్డులు పనిచేయడం లేదన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం 60 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులను ఓపీఎస్ పరిధిలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్‌లు వర్తింపజేసి ఉద్యోగోన్నతులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలన్నారు. జిల్లా అధ్యక్షులు రాఘవులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల పోరాడేందుకు ఎన్‌జీవో సంఘం ఎప్పుడూ ముందుంటుందన్నారు. అనంతరం ఆ సంఘ నాయకులు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను దుశ్శాలువలతో సత్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు జగదీశ్, శివప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట్, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రదీప్, మురళి, సురేశ్, పుమాల, లక్ష్మీపతి, మహేష్, భానుప్రకాష్, సుభాష్, హరి, గురునాథం, జ్యోతి, పురుషోత్తంరెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు.


